హతవిధీ.. ఆర్టీసీ నిపుణుల కమిటీ! 

24 Mar, 2019 02:25 IST|Sakshi

మూడు నెలల కిందటే సిద్ధమైన నివేదిక 

పట్టించుకునేవారు లేక ప్రభుత్వానికి చేరని వైనం 

అధికారులు సహకరించట్లేదని సభ్యుల అసంతృప్తి 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక సంక్షోభంతో మనుగడే ప్రశ్నార్థకం అవుతున్న ఆర్టీసీని బాగుచేసేందుకు ప్రత్యేకంగా ఏర్పడ్డ కమిటీ కూడా చేతులెత్తేసింది. ఉన్నపళంగా సంస్థ బాగు పడాలంటే ఏం చేయాలనే విషయంలో సిఫారసులు చేసేందుకు 8 నెలల కింద ఏర్పాటైన కమిటీ ఇప్పటివరకూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేకపోయింది. అసలు ఆ కమిటీ గురించి పట్టించుకునే వారే లేకపోవటంతో కమిటీ సభ్యులు కూడా మిన్నకుండి పోయారు. ఆర్టీసీకి ప్రస్తుతం పూర్తిస్థాయి ఎండీ, చైర్మన్‌ లేకపోవటం కమిటీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సంస్థను పర్యవేక్షించేవారు లేకపోవటంతో అధికారులు కూడా కమిటీకి సహకరించటం లేదని తెలుస్తోంది. విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్దామంటే, రవాణా శాఖ మంత్రి ఇటీవలే బాధ్యతలు స్వీకరించటం, వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో బిజీ కావటంతో కమిటీ సభ్యులు కలవలేకపోయారు. విచిత్రమేంటంటే.. మూడు నెలల కిందే నివేదిక సిద్ధమైనా, దాన్ని సమర్పించే ఆసక్తి కూడా సభ్యుల్లో నశించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎనిమిది మంది సభ్యులున్నారు.

వారు అన్ని రకాలుగా సంస్థ పనితీరును పరిశీలించి సూచనలతో నివేదిక సిద్ధం చేశారు. కొంత సమాచారం కావాల్సి ఉండగా, ఆ వివరాలు చెప్పేందుకు అధికారు లు సహకరించట్లేదు. కమిటీలో కీలక బాధ్యత ల్లో ఉన్న ఈడీ మాత్రం నిరంతరం అందు బాటులో ఉంటున్నా.. ఓ ఉన్నతాధికారి సభ్యు లను కలిసేందుకు ఆసక్తి చూపట్లేదు. పలు మార్లు సమయం కోరితే అతి కష్టమ్మీద ఒక్క సారి కలసి మొక్కుబడిగా సమావేశాన్ని ముగించారు. వారికే అంత పట్టింపు లేనప్పుడు తామెందుకు పట్టించుకోవాలన్న తీరులో సభ్యులున్నారు. నివేదికపై ఇప్పటికీ కొందరు సభ్యులు సంతకాలు కూడా చేయలేదు’అని కమిటీకి సహకరించిన ఓ ప్రతినిధి వ్యాఖ్యానించారు. గతంలో బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన కర్ణాటక కాంగ్రెస్‌ నేత నాగరాజు కూడా కమిటీ సభ్యులకు అందుబాటులో లేకుండా పోయారు. ఆ నివేదికపై ఆయన సంతకం చేసేందుకు కూడా ఆసక్తి చూపట్లేదట. 

ఇదీ నేపథ్యం.. 
గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మూడేళ్ల కింద ఆర్టీసీ తీరును సమీక్షించారు. అప్పట్లో ఆయన ఎన్నో సూచనలు చేశారు. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోని అధికారులు యథావిధిగా సంస్థను సంక్షోభంలోకి నెట్టేశారు. అప్పట్లో ఎండీగా పనిచేసిన రిటైర్డ్‌ అధికారి రమణారావుకు ఈడీలతో సఖ్య త లేకపోవటం సంస్థపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థను బాగు చేసేందుకు కొంత వరకు కృషి చేసిన నాటి చైర్మన్‌ సోమారపు సత్యనారాయణకు, అప్పటి ఎండీకి మధ్య పొసగలేదు. దీంతో ఎండీ నుంచి సహకారం లేక సోమారపు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. వాస్తవానికి ఆయన కృషి వల్లే నిపుణుల కమిటీ ఏర్పడింది. ఇక మళ్లీ సమీక్షలు కూడా లేకపోవటంతో పరిస్థితి బాగా దిగజారిపోయింది. 

కమిటీ సిఫారసుల్లో కొన్ని.. 
- ఆర్టీసీ నుంచి హైదరాబాద్‌ సిటీని విడదీసి.. మెట్రో రైలుతో కలిపి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. ఇందులో ఎంఎంటీఎస్‌ రైల్‌ నెట్‌వర్క్‌ను కూడా కలపాలి. 
రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు వసతి లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఆర్టీసీ కొత్త బస్సులు సరిగా కొనట్లేదు. వెంటనే 1,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. నిధుల సమస్య ఉంటే విడతల వారీగా కొనాలి. సంస్థలో కాలం చెల్లిన బస్సులను పక్కనపెట్టాలి. వాటివల్ల నష్టాలు పెరుగుతున్నాయి. ఉన్న బస్సుల సామర్థ్యం పెరగాల్సి ఉంది. 
కార్మికులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే తరచూ కార్మికులతో అధికారులకు వివాదాలు తలెత్తి వాటి ప్రభావం సంస్థ పనితీరుపై పడుతోంది. 
సంస్థకు నిరంతరం పూర్తిస్థాయి ఎండీ ఉండాలి. అవగాహన ఉన్న వ్యక్తి చైర్మన్‌గా ఉండాలి. సంస్థపై సరైన పర్యవేక్షణ లేకపోవటంతో పనితీరు బాగా దిగజారిపోతోంది. 
తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పరిపాలన బోర్డు ఉండాలి. ఇది జరగాలంటే ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య పూర్తిస్థాయిలో విభజన జరగాలి.  

>
మరిన్ని వార్తలు