ఆర్టీసీ సమ్మె: 48 రోజులు.. రూ.30 కోట్లు

22 Nov, 2019 08:10 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మెను మించిపోయింది ఆర్టీసీ జేఏసీ సమ్మె. ఆర్టీసీ చరిత్రలోనే సుదీర్ఘమైన 48 రోజుల సమ్మెతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన రూట్లల్లో బస్సులు నడుపుతున్నా గ్రామీణ ప్రాంతాల్లోకి బస్సులు నడుపకపోవడం వల్ల ఆర్టీసీ ఆదాయం సగానికి తగ్గిపోయిందని చెప్పవచ్చు. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ మాజీ ఉద్యోగులు, అధికారులు లెక్కలు వేసి చెబుతున్నారు. అయితే అదేమిలేదంటున్న అధికారులు వాస్తవ గణాంకాలను కూడా వెల్లడించడం లేదు. మరోవైపు సమ్మెలో ఉన్న కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు అందక పడుతున్న పాట్లు వర్ణనాతీతం.

తాత్కాలిక సిబ్బందితో 48 రోజులుగా బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నా.. అవి తిరిగిన రూట్లు అరకొరే. సమ్మెకు ముందు వచ్చిన ఆదాయంలో సగం కూడా ఆర్టీసీ ట్రెజరీలో జమకాలేదు, ఇక సగానికి పైగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోతున్నాయి. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని పది డిపోల్లో ఉన్న 651 బస్సులు సమ్మెకు ముందురోజు వరకు మూడున్నర లక్షల కిలోమీటర్లు తిరిగేవి. ప్రస్తుతం రోజు ఆర్టీసీ, ప్రైవేట్‌కు చెందిన 600 నుంచి 670 బస్సులు తిరుగుతున్నా... అవి సగటున 1.65 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. మరోవైపు రీజియన్‌ పరిధిలోని కార్మికులకు చెల్లించాల్సిన దాదాపు రూ.25 కోట్ల వేతనాలు నిలిచిపోయాయి. 

భారీగా తగ్గిన ఆదాయం...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తోపాటు మరో 22 డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ సెప్టెంబర్‌ 5 నుంచి సమ్మెను తలపెట్టింది. గురువారం నాటికి సమ్మె 48వ రోజుకు చేరుకుంది. గతంలో కరీంనగర్‌ రీజియన్‌లోని కరీంనగర్‌ వన్, టూ డిపోలు, హుజూరాబాద్, గోదావరిఖని, మంథని, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల బస్‌డిపోల పరిధిలో 448 ఆర్టీసీ బస్సులు, 203 అద్దె బస్సులు మొత్తం 651 బస్సులను నడిపించే వారు. ఈ బస్సులు ప్రతిరోజు 3.50 లక్షల కిలోమీటర్లు తిరిగి ప్రయాణికులను గమ్యం చేర్చి రోజుకు రూ.కోటి 10 లక్షల ఆదాయాన్ని ఆర్టీసీకి సమకూర్చిపెట్టేవి. ఇప్పుడు ప్రతిరోజు 620 నుంచి 670 వరకు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులను నడిపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగినా అవి ప్రయాణించే దూరం మాత్రం సగానికి పైగా తగ్గిపోయింది.

గతంలో 3.50 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఇప్పుడు 1.65 లక్షల కిలోమీటర్లు మాత్రమే బస్సులు తిప్పుతున్నారు. దీంతో సగానికి సగం ఆదాయం పడిపోయి రోజుకు సగటున 55 లక్షల రూపాయల ఆదాయం మాత్రమే సమకూరుతున్నది. సమ్మెకు పూర్వం రోజుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు ఆదాయంగా సమకూరేది. ఈ లెక్కన గడిచిన 48 రోజుల్లో రూ.55 కోట్ల వరకు ఆదాయం సమకూరాల్సి ఉండగా... వచ్చిన రాబడి రూ.26.45 కోట్లు మాత్రమే. 48 రోజుల్లో రూ.30 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు జవాబుదారీ తనం లేకపోవడం కూడా ఆదాయంపై ప్రభావం చూపిందని మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. 

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్టీసీ కార్మికులు
ఆర్టీíసీకి వాటిల్లిన నష్టం తరహాలోనే ప్రజలు కూడా ప్రైవేటు వాహనాలకు అధిక చార్జీలు చెల్లించి నష్టపోయారు. కరీంనగర్‌ రీజియన్‌లో 4,130 మంది ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుండగా వారికి నెలకు రూ.10 కోట్ల వేతనాలు చెల్లించేవారు. రెండు నెలలుగా సమ్మె కారణంగా వారు వేతనాలు పొందలేకపోతున్నారు. కార్మికులకు సమ్మెకు ముందు పనిచేసిన కాలానికి కూడా వేతనాలు చెల్లించకపోవడంతో రెండు నెలలుగా జీతాలు రాక పస్తులుం డాల్సి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకా నిక్‌లు, కార్మికులు పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టలేక, ఇంటి అద్దె చెల్లించలేక, అంతకుముందు తీసుకున్న అప్పులు, చిట్టిల కిస్తులు చెల్లించలేక, అనారోగ్యాలు ఏర్పడిన హాస్పిటల్‌ ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నా రు. డిపో మేనేజర్లకు అక్టోబర్‌ నెలలో అలవెన్సులు మాత్రమే చెల్లించాలని, వేతనాలు ఇవ్వద్దని ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమ్మె కారణంగా బస్‌పాసులతో నెలవారీగా వచ్చే రూ.3.85 కోట్లు కూడా రాకుండా పోయింది. సమ్మె కారణంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో వారికి అల్పాహారం, టీ, భోజనం, తాగునీరు సమకూర్చడానికే రోజుకు రూ.50 వేలు వెచ్చించాల్సి వస్తున్నదని, ఇప్పటికే సుమారు రూ.20 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. 

రక్షణ, నిర్వహణ ఖర్చులు అదనపు భారం..
కార్మికులు సమ్మెలో ఉండడంతో డిపోల వద్ద పోలీసు బందోబస్తుతోపాటు రెవెన్యూ, పంచా యతీరాజ్‌ శాఖల ఉద్యోగులను విధులకు కేటా యించారు. ఈ నిర్వహణ భారమంతా ఆర్టీసీనే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నిర్దిష్టం గా ఎంత చెల్లించారనే విషయంలో స్పష్టమైన లెక్కలు వేయలేదని, కానీ యాజమాన్యం నుంచి ఆదేశాలొచ్చిన వెంటనే ఆయా శాఖలకు నిధులివ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. డిపోల వద్ద స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీలు, సివిల్‌ డీఎస్పీల పర్యవేక్షణతోపాటు రోజు ఒక సీఐ నేతృత్వంలో 20 మంది ఇతర పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తంగా ఈ నిర్వహణకు ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో డిపోల్లో రోజూ సగటున రూ.లక్ష 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి దాదాపు రూ.72 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది.

తాత్కాలిక సిబ్బంది.. సగం సేవలు...
కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో 454 మంది తాత్కాలిక డ్రైవర్లు,675 మంది కండక్టర్లు, మెయింటనెన్స్‌ కోసం మరో 300 మంది తాత్కాలిక పద్ధతిలో రోజుకు 600 నుంచి 670 వరకు బస్సులను నడిపిస్తున్నారు. ప్రధాన రూట్లకే బస్సులు పరిమితం అయ్యాయని తెలుస్తోంది. గ్రామీణ రూట్లకు బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక కండక్టర్లకు రోజుకు రూ.1000, తాత్కాలిక డ్రైవర్లకు రూ.1500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. వీరికి ఏ రోజు వేతనం అదే రోజు అందిస్తున్నామని డిపో మేనేజర్లు తెలిపారు.

అధికారులకూ అందని అక్టోబర్‌ వేతనం..
ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులకు కూడా అక్టోబరు వేతనం ఇంకా రాలేదు. యాజమాన్యం వేతనాలను ఇంకా విడుదల చేయలేదని, ఒకటి రెండు రోజుల్లో ఇచ్చే అవకాశముందని అధికా రులు తెలిపారు. డిపోల్లో మేనేజర్లతోపాటు ఒకరిద్దరు సిబ్బంది విధులలో ఉండడంతో షెడ్యూల్స్‌ నిర్వహణ, కలెక్షన్లు సరిచూసుకోవడానికే సరిపోతోందని వారు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా