పైసలిస్తే బస్సులు తిప్పం..!

31 Mar, 2019 05:37 IST|Sakshi

ఆటోవాలాలతో ఆర్టీసీ సిబ్బంది కుమ్మక్కు

సర్వీసులు పెంచకుండా చక్రం తిప్పుతున్న వైనం

బస్సులు లేక  సెవన్‌సీటర్‌ ఆటోలు ఎక్కుతున్న ప్రయాణికులు

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ రహదారిపై ఉన్న ప్రజ్ఞాపూర్‌ కూడలిలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు నిలబడి ఉన్నారు. వారిలో అక్కడి నుంచి భువనగిరి రోడ్డులో ఉన్న జగదేవ్‌పూర్‌ మండల కేంద్రానికి వెళ్లాల్సినవారు అధికం. గంటసేపు ఎదురుచూసినా ఒక్క బస్సు కూడా రాలేదు, అప్పటికే అక్కడ దాదాపు ఇరవై వరకు ఏడు సీట్ల ఆటోలు రారమ్మంటూ ప్రయాణికులను పిలుస్తున్నాయి. ఒక్కో ఆటోలో 15 నుంచి 20 మంది చొప్పున ప్రయాణికులు కిక్కిరిసిపోయి జగదేవ్‌పూర్‌ వైపు సాగిపోయారు. ఇలా నిరంతరం జరుగుతూనే ఉంది. ఇంతడిమాండ్‌ ఉన్నా ఈ మార్గం లో ఆర్టీసీ మాత్రం బస్సు సర్వీసుల సంఖ్య పెంచటం లేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపో యి సిబ్బంది జీతాలు చెల్లించలేని దుస్థితి ఆర్టీసీది. రాష్ట్రం నలుమూలలా ప్రధాన రహదారుల నుంచి మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాలకు వెళ్లే దారుల్లో బస్సుల సంఖ్యను పెంచితే ఆదా యం పెరిగే అవకాశం ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. అడపాదడపా వచ్చే బస్సు లో జనం వేళాడుతూ వెళ్లాల్సి వస్తోంది. బస్సు కోసం అంత సేపు ఎదురు చూడలేక ఏడుగురు ఎక్కాల్సిన ఆటోల్లో 15 నుంచి 20 మంది వరకు ప్రయాణిస్తున్నారు. 

బస్సుల కొరత అంటూ భారీగా వసూళ్లు.. 
ప్రతి ఆర్టీసీ డిపో పరిధిలో సిబ్బంది క్రమం తప్పకుండా రూట్‌ సర్వే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఏయే మార్గాల్లో ప్రయాణికుల నుంచి డిమాండ్‌ వస్తోందో తెలుసుకుని కొత్తగా సర్వీసులు ప్రారంభించటం దీని ఉద్దేశం. కానీ కొందరు సిబ్బంది ఆటోవాలాలతో కుమ్మక్కై కొత్త సర్వీసులు ప్రారంభించబోమని చెప్పి ఒక్కో ఆటో నుంచి ప్రతినెలా వసూలు చేసుకుంటున్నారు. ఆటో యూనియన్‌ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కొత్త బస్సుకోసం డి మాండ్‌ రాగానే ‘కొనేందుకు నిధులెక్కడివి’  అంటూ అధికారులు తిరస్కరిస్తున్నారు.  

తిక్క వ్యవహారాలు... 
గజ్వేల్‌ మండల కేంద్రం నుంచి జగదేవ్‌పూర్‌ మండల కేంద్రానికి బాగా డిమాండ్‌ ఉంది. కానీ, ఆర్టీసీ అధికారులు మాత్రం గజ్వేల్‌ నుంచి జగదేవ్‌పూర్‌ మీదుగా భువనగిరి వరకు సర్వీసులు నడుపుతున్నారు. ఇవి పరిమితంగా ఉండటంతో గజ్వేల్‌లో బయలుదేరిన బస్సు భువనగిరి వరకు వెళ్లి తిరిగి వచ్చేందుకు బాగా సమయం పడుతోంది. ఈలోపు ప్రజ్ఞాపూర్‌ వద్ద వేచిఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. సిద్దిపేట మార్గంలో సిద్దిపేట–చేర్యాల, సిద్దిపేట– కొమురవెల్లి, అయినాపూర్, అయినాపూర్‌–చేర్యాల, సూర్యాపేట–ఆత్మకూరు, ఆదిలాబాద్‌–మంచిర్యాల రోడ్డు, సిరిసిల్ల–కరీంనగర్‌ రోడ్డు, మంథని–పెద్దపల్లి రోడ్డులను అనుసంధానం చేసుకుని ఉండే చాలా గ్రామాలవైపు బస్సు సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయి. జగిత్యాల నుంచి చందుర్తి, వేములవాడ, కొండగట్టువైపు వెళ్లే మార్గాల్లో బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. ఇటీవల కొండగట్టు వద్ద దాదాపు 90 మంది ప్రయాణికులతో వెళ్తూ బస్సు బోల్తాపడి 70 మందిని మించి చనిపోయిన దుర్ఘటనే దీనికి సాక్ష్యం. తక్కువ ఖర్చు అయ్యే మినీ బస్సులు ఎక్కువ సంఖ్యలో కొను గోలు చేసి గ్రామాలకు తిప్పాల్సి ఉంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా