సకలజనుల సమ్మెతో సమం

31 Oct, 2019 03:43 IST|Sakshi

నేటితో 27 రోజులు పూర్తి చేసుకోనున్న ఆర్టీసీ సమ్మె 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గకుండా ఉధృతంగా సమ్మె కొనసాగిస్తున్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన సకల జనభేరీ సభకు అన్ని జిల్లాల నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు. సభ నిర్వహించిన స్టేడియం సామర్థ్యం చిన్నది కావటంతో జేఏసీ నేతలు జనసమీకరణకు పెద్దగా యత్నించలేదు. అయినా జిల్లాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సుల్లో తరలివెళ్లారు. మిగిలినవారు ఆయా డిపోల ముందు నిరసనలు కొనసాగించారు. బుధవారంతో సమ్మె 26 రోజులు పూర్తి చేసుకుంది.

గురువారంతో తెలంగాణ సాధన కోసం జరిపిన సకల జనుల సమ్మె కాలంతో సమమవుతుంది. అదనంగా ఒక్కరోజు దాటినా తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘ సమ్మెగా రికార్డుల కెక్కనుంది. 2013లో జరిగిన సకల జనుల సమ్మె సమయంలో 27 రోజుల పాటు బస్సులు నిలిపేసి కార్మికులు సమ్మె చేశారు. ఇప్పుడు అంతకంటే దీర్ఘకాల సమ్మెగా అవతరించనుంది. 

72 శాతం బస్సులు తిప్పాం: ఆర్టీసీ 
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 72.8 శాతం బస్సు లు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,575 ఆర్టీసీ బస్సులు, 1,950 అద్దె బస్సులు తిప్పినట్లు వెల్లడించింది. 4,575 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,515 ప్రైవేట్‌ కండక్టర్లు విధులకు వచ్చారని, 5598 బస్సుల్లో టిమ్‌ యంత్రాలు వాడారని, 542 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు