బస్సులు నడుస్తున్నాయి కానీ...

13 May, 2015 13:48 IST|Sakshi
బస్సులు నడుస్తున్నాయి కానీ...

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇస్తే కానీ బస్సులు తిప్పేది లేదంటూ ఆర్టీసీ కార్మికులు భీష్మించుకోవటంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి దెబ్బే తగిలింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేయటంతో పాటు, లాభాలు పుంజుకోవాలంటే అందుకు వేసవి కాలమే అసలైన సీజన్.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ...వేసవితో పాటు మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా కలసి రావడంతో ఎంతో కొంత లాభాలు పండించు కోవచ్చని ఆర్టీసీ యాజమాన్యం ఆశపడింది. టైమ్ చూసి దెబ్బ కొట్టినట్లు కార్మికులు సమ్మె రూపంలో ఆ ఆశను ఆడియాశ చేశారు. సమ్మె నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు, ఆటోవాలాలు ఎంత దండుకోవాలో అంత దండుకుంటున్నారు. వారి రేట్ల దెబ్బకు ఏ వాహనం లేని మధ్య తరగతి ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి.

అయితే నగర జీవులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిటీ బస్సులు నడిపిస్తాంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించినా అది ఆచరణలో అటకెక్కింది. పంతం కొద్దీ కాంట్రాక్ట్  డ్రైవర్కు రూ.1000, కండక్టర్కు రూ.800 ఇచ్చి తాత్కాలిక ఉద్యోగులను నియమించి అరా కొరా బస్సులు తిప్పుతున్నా అవి ఎటూ సరిపోవటం లేదు.

ప్రైవేట్ ట్రావెల్స్ , ఆటోవాలాల బాదుడు నుంచి తప్పించుకునేందుకు ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు పడి.. అవి ఎక్కినా...అక్కడ కూడా మరో రకం బాదుడే. బస్సు ఎక్కాక తీరిగ్గా బస్సులో పాస్లు చెల్లవు ... టికెట్ తీసుకోవాలంటూ కండాక్టర్లు చెప్పడంతో.. ముందే డబ్బు కట్టి బస్ పాస్లు తీసుకున్న వాళ్లకు షాక్. అదేమని ప్రశ్నిస్తే... డిపో మేనేజరే చెప్పారంటూ సమాధానం. అంతేకాకుండా ఏడు రూపాయల టిక్కెట్ ఇచ్చి పది రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేయటం విశేషం. అదేమంటే...అంతే ఇష్టమైన ఎక్కు...లేకుంటే దిగిపో అని గీరగా సమాధానం వస్తుంది.

వెరసి కడుపుమండిన బడుగు జీవులు.. నానా తిట్లు లక్కించుకోవటం, నాశనం అయిపోతారు, నీ బొందలో పెట్టుకో, పబ్లిక్ వెర్రోళ్లా...అంటూ శాపనార్థాలు. ఇంతదానికి బస్సులు తిప్పుడెందుకు అంటూ పాస్ హోల్డర్లు ఆర్టీసీని దుమ్మెత్తి పోస్తున్నారు. బస్సులు నడుస్తున్నాయి కానీ  ... బస్ పాస్లు నడవటం లేదంటూ గొణుక్కోవటం మినహా మరేమీ చేయలేకపోతున్నారు. 

మరిన్ని వార్తలు