సమ్మె జోరు.. ప్రయాణం బేజారు

9 May, 2015 00:25 IST|Sakshi
సమ్మె జోరు.. ప్రయాణం బేజారు

మూడో రోజూ కదలని బస్సులు
పోలీస్ ఎస్కార్ట్‌తో నడిపే యత్నం
ఎక్కడికక్కడ అడ్డుకున్న కార్మికులు
దుబ్బాకలో అర్ధనగ్న ప్రదర్శన

 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. మూడో రోజైన శుక్రవారం కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పోలీస్ ఎస్కార్ట్‌తో బస్సులను నడపాలని అధికారులు ప్రయత్నించినా.. కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అధికారులు ఎంత ప్రయత్నించినా ఆశించిన మేర బస్సులను రోడ్డెక్కించలేకపోయారు.

35 బస్సులు మాత్రమే బయటకు తీయగా.. 161 బస్సులు నడిపామంటున్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడం, ఇక్కడ సమ్మె జరిగే తీరు రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మిక సంఘాల ఉద్యమంపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో సమ్మె ప్రభావం లేదని చెప్పడానికి ఆర్టీసీ యాజమాన్యం, పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

 కండక్టర్ ఆత్మహత్యాయత్నం
 అధికారుల తీరును నిరసిస్తూ బహీరాబాద్ డిపో వద్ద చంద్రప్ప అనే కండక్టర్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. పక్కనే గల తోటి కార్మికులు అడ్డుకున్నారు. ఆయన తొడ భాగాలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
► సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ప్రైవేటు సిబ్బందితో శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు సంగారెడ్డి డిపో నుంచి 12 బస్సులను బయటకు పంపించారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘం నాయకులు 4 గంటలకు డిపో వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.
►  మెదక్ డిపో వద్ద పోలీసులు మహిళా కార్మికులను నెట్టేసిన తీరు వివాదాస్పదమవుతోంది.
►  సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 54 ఆర్టీసీ, 18 అద్దె బస్సులుండగా.. ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు. కార్మికులు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
► దుబ్బాక డిపో నుంచి ఒక్క బస్సూ కదల్లేదు. మెదక్ డిపోకు చెందిన బస్సు దుబ్బాక వరకు నడిపించగా.. దుండగులు బస్సు అద్దాలు పగులగొట్టారు. అర్ధనగ్న ప్రదర్శనతో పాటు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు.
► నారాయణఖేడ్‌లో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొని బస్సులు నడిపిస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో డిపో వద్దకు రాగానే కార్మికులు అడ్డుకొని వారిని వెనక్కి పంపించారు.
► సిద్దిపేట డిపో పరిధిలో శుక్రవారం రెండు కేసులు నమోదయ్యాయి. డిపో నుంచి వస్తున్న బస్సులను అడ్డుకున్నందుకు, తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి వచ్చిన వారిపై దాడి చేసినందుకు పోలీసులు కార్మికులపై కేసులు నమోదు చేశారు. అలాగే గురువారం రెండు బస్సుల టైర్ల నుంచి గాలి తీసినందుకు గాను కేసు నమోదైంది. మొత్తం ఈ మూడింటికి సంబంధించి సుమారు వంద మందిపై కేసులు నమోదయ్యాయి.
► మూడో రోజు సమ్మె కారణంగా రూ.98 లక్షల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు

మరిన్ని వార్తలు