డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత

13 Oct, 2019 11:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన  డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తరలించారు. 
(చదవండి : గూండాగిరీ నడవదు.. కేసీఆర్‌ తీవ్ర హెచ్చరికలు)

కాగా, కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం ఆస్పత్రికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆస్పత్రి వద్దకు చేరుకుని శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డి మృతి నేపథ్యంలో రేపు (సోమవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.


(చదవండి : ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం)

మరిన్ని వార్తలు