తాత్కాలిక డ్రైవర్‌కు ఫిట్స్‌

12 Oct, 2019 08:56 IST|Sakshi
ఆసుపత్రిలో డ్రైవర్‌ నుంచి వివరాలు సేకరిస్తున్న మాక్లూర్‌ పోలీసులు

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్‌కు దాస్‌నగర్‌ గ్రామశివారులో ఫిట్స్‌ రావడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. శుక్రవారం కోరుట్ల డిపోకు చెందిన (టీఎస్‌ 02 జెడ్‌ 0283) బస్సు సాయంత్రం 7.30 గంటల సమయంలో నిజామాబాద్‌ నుంచి కోరుట్లకు బయలుదేరింది. ఇందులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. మాక్లూర్‌ మండలం దాస్‌నగర్‌ వద్దకు రాగానే బస్‌డ్రైవర్‌ ప్రసాద్‌కు ఫిట్స్‌ వచ్చాయి. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పొలాల్లో బస్సు నిలిచిపోయింది. డ్రైవర్‌ ప్రసాద్‌కు కొద్దిపాటి గాయాలు అయ్యాయి. బస్సు పొలాల్లోకి వెళ్లగానే ప్రయాణికులు ఆందోళన చెంది కేకలు వేశారు. ఓవైపు చీకటి పడింది. అత్యవసర డోర్‌ ద్వారా 25 మంది బస్సునుంచి  బయటకు వచ్చారు. మాక్లూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించి వారిని మరో బస్సు కోరుట్లకు తరలించారు. డ్రైవర్‌ను జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.  
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్‌గా ప్రసాద్‌ కోరుట్ల డిపోలో ఐదు రోజుల చేరాడు. ఆర్టీసీ అధికారులు హడావుడిగా అనుభవం, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా తాత్కాలిక డ్రైవర్లను నియమించడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తమైంది.

మరిన్ని వార్తలు