టీ–వాలెట్‌తో ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌లు

21 Jul, 2018 01:33 IST|Sakshi

ముందస్తు రిజర్వేషన్లకు సదుపాయం

టీ–వాలెట్‌ ద్వారానే చార్జీల చెల్లింపు

మొబైల్‌ ఫోన్‌కు వచ్చే ఎస్సెమ్మెస్సే టికెట్‌గా గుర్తింపు

రోజుకు 6 వేల టికెట్‌ బుకింగ్‌లకు సదుపాయం

త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా  ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లకు సంబంధించి ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇక నుంచి ‘టీ–వాలెట్‌’మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా రిజర్వేషన్లు బుక్‌ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ రిజర్వేషన్లకు టీ–వాలెట్‌ ద్వారానే చార్జీలు కూడా చెల్లించవచ్చు. దీంతో ప్రయాణికుల ఈ మెయిల్‌ అడ్రస్‌కు, మొబైల్‌ ఫోన్‌కు టికెట్‌ బుకింగ్‌ సంక్షిప్త సందేశం వస్తుంది.

ప్రయాణ సమయంలో పేపర్‌లెస్‌ టికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. హైదరాబాద్‌ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే 1,770 బస్సుల్లో ఈ సదుపాయాన్ని మరో రెండు రోజుల్లో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ శుక్రవారం బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

ప్రతిరోజు ఆర్టీసీ బస్‌స్టేషన్లలోని కౌంటర్లు, అధీకృత టికెట్‌ బుకింగ్‌ ఏజెన్సీలు, టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ ద్వారా 13,000 మంది ప్రయాణికులు రిజర్వేషన్‌ టికెట్లు తీసుకుంటున్నారు. వీటిలో 6,009 టికెట్లు కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకుంటున్నారు. ఈ టికెట్లపైన ఆర్టీసీకి ప్రతిరోజు రూ.61.09 లక్షల ఆదాయం లభిస్తుంది. ఇక నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌లన్నింటినీ టీ–వాలెట్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు.  

త్వరలో బస్‌పాస్‌లకు విస్తరణ..
మరోవైపు ఆర్టీసీ అందజేసే వివిధ రకాల బస్‌పాస్‌లకు కూడా టీ–వాలెట్‌ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే అన్ని రకాల పాస్‌లను ఆన్‌లైన్‌ చేశారు. విద్యార్ధులు, ఉద్యోగులు తదితర వర్గాల ప్రయాణికులు ఆన్‌లైన్‌ ద్వారా పాస్‌లు తీసుకొనే సదుపాయం ఉంది. టీ–వాలెట్‌కు దీన్ని అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులు ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపేందుకు అవకాశం ఉంటుంది.  

ఏఎస్‌ఆర్‌టీయూ నిబంధనల మేరకే బయోడీజిల్‌ కొనుగోలు..
ఆర్టీసీలో బయోడీజిల్‌ వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించినట్లు ఆర్టీసీ చైర్మన్‌ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 35 వేల లీటర్లు వినియోగిస్తున్నామని, త్వరలో దీనిని లక్ష లీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 5 లక్షల లీటర్ల సాధారణ డీజిల్‌కు 20 శాతం చొప్పున లక్ష లీటర్ల బయోడీజిల్‌ను వినియోగించాల్సి ఉందన్నారు. తద్వారా కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, ప్రజలకు పర్యావరణ ప్రియమైన ప్రయాణ సదుపాయం లభిస్తుందన్నారు.

ఇందుకోసం తాము ఏఎస్‌ఆర్‌టీయూ నిబంధనల మేరకే బయోడీజిల్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు. సాధారణ డీజిల్‌ ధరలపైన రూ.2 తక్కువకు బయోడీజిల్‌ కొనుగోలు చేయవచ్చునని ఏఎస్‌ఆర్టీయూ సూచించింది. కానీ తాము రూ.4 తక్కువకు అద్వైత్‌ అనే సంస్థ నుంచి బయోడీజిల్‌ కొనుగోలు చేస్తున్నట్లు చైర్మన్‌ తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల ఆన్‌డెప్యుటేషన్‌ బదిలీలు, అనారోగ్య సెలవుల విధానంలో కూడా పారదర్శకమైన పద్ధతులను పాటిస్తున్నట్లు చెప్పారు.

టీ–వాలెట్‌ ద్వారా బుకింగ్‌ ఇలా...
విద్యుత్‌ బిల్లులు, నల్లా బిల్లులు, ఇంటిపన్ను తదితర చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇప్పటికే టీ–వాలెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ వాలెట్‌లో కొంత మొత్తాన్ని నిల్వ ఉంచుకొని పేటీఎం తరహాలో వినియోగించుకోవచ్చు. గూగుల్‌ ప్లేస్లోర్‌ నుంచి ఈ వాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్లో క్రెడిట్, డెబిట్‌ కార్డులను వినియోగించి ఆర్టీసీ టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఇక నుంచి ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా, ఏ సమయంలోనే తమ మొబైల్‌ ఫోన్‌ నుంచి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

క్షణాల్లోనే మొబైల్‌కు సమాచారం వచ్చేస్తుంది. అధీకృత టికెట్‌ బుకింగ్‌ ఏజెన్సీల వద్ద కానీ, ఆర్టీసీ బుకింగ్‌ కౌంటర్‌ల వద్ద కానీ పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి ప్రతిరోజు విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు, చెన్నై, ముంబై, షిరిడీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే 1,770 టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో టీ– వాలెట్‌ ద్వారా బుకింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు.

నష్టాలను అధిగమిస్తూనే మెరుగైన సేవలు: సోమారపు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) ఆర్థికంగా నిలదొక్కుకోవాడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోందని సంస్థ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బస్‌భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఎస్‌ ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రైవేట్‌ వాహనాల పోటీని తట్టుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోందన్నారు.

ప్రజారవాణా వ్యవస్థలో పోటీ నెలకొందని.. ఆటో, మ్యాక్స్, తుఫాన్, సెవెన్‌ సీటర్స్‌ వంటి ప్రైవేట్‌ వాహనాల పోటీని తట్టుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ సంస్థకు వచ్చే రాబడి రూ.11 కోట్లు కాగా, ఖర్చు రూ.14 కోట్లు అవుతోందని చెప్పారు. సంస్థకు భారం పెరిగినప్పటికీ సిబ్బందికి వర్తించే ప్రయోజనాలను కొంచెం అటు, ఇటుగా వర్తింపజేస్తున్నామన్నారు. కష్ట సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సమకూర్చుకోవడం జరుగుతోందన్నారు. టీఎస్‌ ఆర్టీసీ దేశంలోనే జీరో యాక్సిడెంట్‌ రేటుతో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు