సమ్మెకు సై!

6 May, 2015 00:29 IST|Sakshi
సమ్మెకు సై!

ఆగనున్న ఆర్టీసీ చక్రం
సంగారెడ్డి క్రైం: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా తమకూ 43 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలోని సంగారెడ్డి, దుబ్బాక, నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, మెదక్, సిద్దిపేట డిపోల్లోని దాదాపు 700కుపైగా బస్సులు ఆగిపోయాయి. వేతన సవరణ తదితర సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా గల 3,500 మంది కార్మికులు ఈ సమ్మెకు పూనుకున్నారు.

సమ్మెలో తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్, భారతీయ మజ్దూర్ సంఘ్, ఎస్‌డబ్ల్యుఎఫ్ యూనియన్లు పాల్గొంటున్నాయి. కార్మిక సంఘ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ సమ్మెకు దిగారు. బస్సులు రోడ్డెక్కకపోవడంతో జిల్లాలో అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, వేసవి సెలవులు కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...
ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లాలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను తిప్పాలని భావిస్తోంది. భారీ వాహన లెసైన్సులు కలిగిన డ్రైవర్లతోపాటు టెన్త్ ఉత్తీర్ణులైన యువతను కండక్టర్లుగా నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
 
సమ్మెను విరమించాలి...
ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే కార్మికులు సమ్మెను విరమించాలి. పెళ్లిళ్ల సీజన్ ఉన్నందున కార్మికులు ప్రయాణికులకు సహకరించాలి. ప్రభుత్వంతో జరిపిన చర్చల నేపథ్యంలో కార్మికులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని ఒప్పుకుంది. సీజన్ తర్వాత ఈ బెనిఫిట్‌ను పెంచే అవకాశం ఉంది. ఇది కార్మికులు అర్థం చేసుకోవాలి. సమ్మె అనివార్యమైతే ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపిస్తాం.
 - బి.రాజు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, సంగారెడ్డి
 
ఉధృతం చేస్తాం..

సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం తప్పదు. 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందే. రెండేళ్లు మాకు తీవ్ర అన్యా యం జరిగింది. అన్ని డిపోల్లో సమ్మెను ఉధృతం చేస్తాం. జిల్లాలో ఒక్క బస్సునూ కదలనివ్వబోం. ప్రయాణికులు మా సమస్యను అర్థం చేసుకొని సహకరించాలి. - పల్లె కృష్ణమూర్తి, సంగారెడ్డి టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా