ఆర్టీసీలో నిఘా అధికారి వసూళ్ల పర్వం

22 Mar, 2019 01:15 IST|Sakshi

ఉన్నతాధికారిపై ఫిర్యాదుల వెల్లువ

ఎండీ, చైర్మన్‌ లేకపోవడంతో పెద్ద ఎత్తున అక్రమాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఆయనో కీలక అధికారి. డిపోలపై నిఘా వేసి అక్రమాలు వెలికి తీయాల్సిన ముఖ్యమైన బాధ్యత ఆయనది. ఆయన పరిధిలో దాదాపు 30 డిపోలున్నాయి. గుర్తొచ్చినప్పుడు మినహా కార్యాలయం మొహమూ చూడరు. సిటీలో సొంత వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. కానీ డిపోల నుంచి యథేచ్ఛగా మామూళ్లు దండుకుంటారు. బస్‌ భవన్‌లో సీనియర్‌ అధికారులతో   ‘టచ్‌’లో ఉంటూ బదిలీలు, ఇతర పైరవీల్లో మునిగి తేలుతుంటారు. ఇది పదవీ విరమణ పొందిన ఓ అధికారి వ్యవహారం. గతంలో పదవీవిరమణ పొం దిన అధికారులను ఆర్టీసీలో ఉద్యోగాల్లోకి తీసుకున్న సమయంలో ఈయన కూడా దూరారు. అప్పట్లో ఇలాగే రిటైర్‌మెంట్‌ తర్వాత కీలకపోస్టు నిర్వహించిన ముఖ్యఅధికారి ఈయనపై ఈగ వాలనీయకుం డా చూసుకున్నారు. ఆ అధికారిని ప్రభుత్వం తప్పించటంతో ఇప్పుడు బస్‌భవన్‌లో కీలకంగా ఉన్న అధికారుల పంచన చేరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. ఇప్పుడు దీనిపై రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. 

బస్‌భవన్‌లోని ఉన్నతాధికారి అండ.. 
కొంతకాలంగా ఆర్టీసీలో విజిలెన్సు విభాగం పూర్తిగా నిర్వీర్యమైంది. గతంలో ఈ విభాగాన్ని పర్యవేక్షించిన ఓ ఉన్నతాధికారి తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఫిర్యాదులు ఎక్కువ కావటంతో ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనకు అనుచరుడిగా ముద్రపడ్డ మరో అధికారిపై ఇప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయానికి వెళ్లకుం   డా, ఆయా డిపోల్లో చిన్నచిన్న తప్పిదాలకు పాల్పడ్డ వారిని గుర్తించి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు చెబుతున్నాయి. ఇక సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నాడని, సహకరించని వారిని బదిలీ చేయించి వేధిస్తున్నాడని ఇటీవల కొందరు సిబ్బంది ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బస్‌భవన్‌లో కీలక పోస్టులో ఉన్న ఓ ఉన్నతాధికారి ఆయనకు  అండగా నిలుస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.  

పట్టించుకునే వారు లేరన్న ధీమా.. 
ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ లేరు. గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన సోమారపు సత్యనారాయణ ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోవటంతో చైర్మన్‌ పోస్టు కూడా ఖాళీగా ఉంది. దీంతో పట్టించుకునేవారు లేరన్న ధీమాతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడు. గతంలోనే పదవీ విరమణ పొందినప్పటికీ, భారీ జీతంతో ఆర్టీసీలో ఆయనకు మళ్లీ అవకాశం కల్పించారు. దీంతో తనపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేరన్న ధీమాతో ఆయన విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, ఆయనను అడ్డం పెట్టుకుని ఆర్టీసీలో ఓ ఉన్నతాధికారి డిపోల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, రకరకాల కారణాలతో సస్పెన్షన్‌కు గురైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్ల చేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు