ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో దీపావళికీ చీకట్లే!

26 Oct, 2019 09:53 IST|Sakshi

సమ్మెలో కార్మికులు.. కష్టాల్లో కుటుంబాలు

బతుకమ్మ సంబురం లేదు..  కొత్త దుస్తులు లేవు

నేటికీ అందని సెప్టెంబర్‌ నెల జీతాలు

అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులు

సాక్షి సిద్దిపేట : ఇది ఆర్టీసీ కార్మికుల కుటుంబాల పరిస్థితి. తెలంగాణలో పెద్దపండగ బతుకమ్మ అప్పుడు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది.. సమస్యలు తీరుతాయని ఊహించిన కార్మికుల పరిస్థితి అంతా తారుమారైంది.  దీంతో సెప్టెంబర్‌ నెల వేతనం అందక అక్టోబర్‌ నెల వేతనం వస్తుందో రాదో తెలియని దుస్థితి. బతుకమ్మకు ఇంటిల్లిపాది కొత్తబట్టలు వేసుకునే సాంప్రదాయం ఉండగా కార్మికులు మాత్రం పాత బట్టలతోనే పండుగ జరుపుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో వంటావార్పు కార్యక్రమాలకు పరిమితమయ్యారు. దసరాకు కళ లేదు. ఆడపడుచులను ఈ ఏడాది పండుగలకు  ఇంటికి కూడా పిలువలేని పరస్థితి. చూస్తూ ఉండగానే దీపావళి వచ్చింది. అందరి ఇళ్లలో  దీపావళి వెలుగులు నింపగా.. కార్మికుల ఇళ్లలో మాత్రం చీకటి తెరలు కమ్మి ఉన్నాయి. నోములను  వాయిదా వేస్తున్నారు.  సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో.. తమ సమస్యలు ఎప్పటికి తీరుతాయో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 

జీతంతోనే కుటుంబ పోషణ
ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు జిల్లాలో మొత్తం 1,147 మంది ఉన్నారు. అంటే ఇన్ని కుటుంబాలు బతుకమ్మ, దసరా, ఇప్పుడు దీపావళి పండుగకు వీరి ఇళ్లలో కళ తప్పింది. పలువురి ఇళ్లలో పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి. సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్‌లలో బస్సు డిపోలు ఉన్నాయి. ఈ డిపోల ద్వారా ఆర్టీసీ బస్సులు 209, అద్దెబస్సులు 77 నడుస్తున్నాయి. అయితే ఇందులో పనిచేసే 411 డ్రైవర్లు, 506 కండక్టర్లు, మెకానిక్, ఇతర కార్మికులు 228 మంది ఉన్నారు. మొత్తం 1,147 కుటుంబాలు ఉండగా.. వీరికి నెలకు వేతనాలు రూ. 16వేల నుంచి ఎక్కువ ఎక్కువగా రూ. 46 వేలు సర్వీస్‌ మరీ ఎక్కువైతే రూ. 50వేల వరకు వస్తాయి. వీటితోనే కుటుంబాలు సాధుకోవాలి. రెండు నెలలుగా వేతనాలు నిలిచి పోవడంతో  వీరికి తల్లిదండ్రులు, పిల్లలు, అత్తామామ అందరూ పండుగ పూట ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

భారమైన కుటుంబ పోషణ
మల్లేశం ఆర్టీసీ  డ్రైవర్‌. 26 ఏళ్లుగా సంస్థలో  కార్మికునిగా  పని చేస్తున్నాడు.  ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  పండుగ వచ్చిందంటే చాలు  పేద కుటుంబం అయినప్పటికీ మల్లేశం ఇంట్లో సందడి ఉంటుంది. ముఖ్యంగా  బతుకమ్మ, దసరా పండుగ రోజు బిడ్డ, అల్లుడు, మనమరాలు,  కొడుకు, భార్యతో  ఎంతో  ఆనందంగా సంతోషంగా ఉండేవారు. కానీ ఈ సారి పండుగ పూట పస్తులు తప్పలేదు. సమ్మె  నేపథ్యంలో అందరితోపాటు మల్లేశం కూడా ఆందోళనలో పాల్గొంటున్నాడు.  ఇప్పటివరకు సెప్టెంబర్‌ నెల వేతనాలను విడుదల చేయకపోవడంతో పూటగడవడమే కష్టంగా మారింది.   ప్రతీ ఏడాది దసరా పండుగ భార్య , కూతురుకు  కొత్త బట్టలు కొనిచ్చే మల్లేశానికి ఈ సారి ఆర్థిక సమస్య ఎదురైంది.  జేబులో ఒక్క పైసా లేకుండా కుటుంబ సభ్యులు పోషణ తలకు మించిన భారంగా మారింది.  దీపావళి పండుగ  మరీ దారుణంగా ఉంటుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.  దీపావళికి  కూతురు, అల్లుడిని పండుగకు పిలవాలంటే  భయమేస్తుందని మల్లేశం  బాధపడుతున్నాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా