ఆర్టీసీకి వణుకు! 

8 May, 2018 03:10 IST|Sakshi
టీఎంయూ ఆధ్వర్యంలో బస్‌భవన్‌ను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు

వేతన సవరణ కోసం కార్మికుల పట్టు

అదే జరిగితే సంస్థపై రూ.300 కోట్ల అదనపు భారం

గత వేతన సవరణ భారాన్ని మోయలేక కుదేలైన సంస్థ

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ నిలువెల్లా వణికిపోయే పరిస్థితి తలెత్తింది. గతంలో కార్మికులు అడిగిన దానికంటే ఎక్కువ వేతన సవరణకు ఉదారంగా అంగీకరించిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులెత్తేయడంతో దివాలా దశకు చేరుకుంది. సిబ్బందికి వేతనాలు చెల్లించటం కూడా కష్టంగా మారింది. ఇప్పుడు మరోసారి వేతన సవరణ కోసం కార్మికులు పట్టుపడుతుండటంతో సంస్థకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. సాధారణంగా ఆర్టీసీలో వేతన సవరణ గడువు ప్రకారం జరగదు. ఎప్పుడూ రెండుమూడేళ్ల ఆలస్యంగానే జరుగుతుంది. ఈసారి గడువు తీరి ఏడాది గడిచింది. దీంతో వెంటనే కొత్త వేతన సవరణ చేయాలంటూ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తిస్థాయి వేతన సవరణ జరిగే వరకు ఎదురుచూడకుండా ముందుగానే మధ్యంతర భృతి(ఐఆర్‌) ప్రకటించాలని, అది 25 శాతం తగ్గకుండా ఉండాలని యాజమాన్యం ముందు డిమాండ్‌ ఉంచారు. 

జీతాలకే దిక్కులు.. 
ప్రస్తుతం ప్రతినెలా వేతనాల కోసం ఆర్టీసీ యాజమాన్యం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మే నెల వేతనాలు నాలుగు రోజులు ఆలస్యంగా అందించింది. ఈ పరిస్థితిలో కార్మికులు డిమాండ్‌ చేస్తున్న 25 శాతం మధ్యంతర ఉపశమనం ప్రకటిస్తే సాలీనా రూ.300 కోట్ల భారం పడుతుంది. దాన్ని భరించే శక్తి ప్రస్తుతం ఆర్టీసీకి లేదు. గత వేతన సవరణ సమయంలో ఆర్టీసీకి 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. 32 నుంచి 35 శాతం మధ్య ప్రకటించినా చాలని కార్మికులు అనుకున్నా.. ప్రభుత్వం 44 శాతం ప్రకటించడం కార్మికులను ఆశ్చర్యపరిచింది. దాంతో ఏటా రూ.850 కోట్ల భారం పడింది. ఆ భారం పూర్తిగా ఆర్టీసీపై పడకుండా చూస్తామని అప్పట్లో సీఎం హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపు సమయంలో ప్రభుత్వం రూ.750 కోట్లు అందజేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. పెరిగిన జీతాలు చెల్లించటం సాధ్యం కాక కొత్త నియామకాలను ఆర్టీసీ పూర్తిగా నిలిపేసింది. 

ఆదుకోకుంటే కష్టమే! 
పదవీవిరమణ పొందినవారి స్థానంలో కొత్త సిబ్బంది లేక ఉన్నవారిపై భారం పడింది. దీంతో పని ఒత్తిడి పెరుగుతోందంటూ కార్మికులు యాజమాన్యంతో ఘర్షణకు దిగుతున్నారు. వెరసి సంస్థ నిర్వహణ యావత్తు అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి తరుణంలో అదనంగా రూ.300 కోట్లు భారం మోయటం అసాధ్యం. దీంతో ఏం చేయాలో తోచక ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని, సాయం అందకుంటే సంస్థను నడపలేమంటూ సీఎంకు వివరించాలని నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అధికారులు కలవనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీకే ఆర్టీసీ వేతన సవరణ బాధ్యలిస్తారా? మరో కమిటీ ఏర్పాటు చేస్తారా? అన్న అంశంపై స్పష్టత లేదు.

సగం బస్సులు డిపోలకే పరిమితం 
ఆర్టీసీ గుర్తింపు సంఘం సోమవారం బస్‌భవన్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉదయం 50 శాతానికంటే ఎక్కువ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అధికారులు అతికష్టం మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కొన్ని బస్సులను తిప్పగలిగారు. కండక్టర్లు అందుబాటులో లేనిచోట డ్రైవర్లతోనే కండక్టర్‌ విధులు చేయించారు. 

మరిన్ని వార్తలు