సెలవు.. వివాదాల నెలవు

21 Apr, 2017 02:35 IST|Sakshi
సెలవు.. వివాదాల నెలవు

‘నెలలో మూడు రోజులు సెలవు’పై ఆర్టీసీలో రగడ
అనుమతి లేకుండా డుమ్మా కొట్టే సిబ్బందిపై డిస్మిస్‌ కొరడా
♦  కార్మిక నేతలు, అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం


సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో కార్మికులకు, అధికారులకు మధ్య సెలవుల రగడ మొదలైంది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే డ్రైవర్లు, కండక్టర్లపై యాజమాన్యం కఠిన చర్యలకు దిగడం వివాదాస్పదమవుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నెలలో మూడు రోజులు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది. చాలామంది సిబ్బంది ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరై తర్వాత దాన్ని మూడు రోజుల సెలవు విధానంలోకి మార్చుకుంటున్నారు.

అకస్మాత్తుగా విధులకు డుమ్మా కొడుతుండటంతో బస్సు సర్వీసు షెడ్యూళ్లకు తీవ్ర విఘాతం కలుగుతోంది. దీనిపై యాజమాన్యానికి డిపో మేనేజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, పరిస్థితి పునరావృతమయితే విధుల నుంచి తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో కొందరు కార్మిక నేతలు యాజమాన్యం వైఖరిని తప్పుపడుతూ ఆయా డిపోల్లో ఆందోళనలకు దిగుతున్నారు. వెరసి కార్మిక నేతలు, అధికారులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది.

జిల్లా సర్వీసులకు తీవ్ర విఘాతం
హైదరాబాద్‌లోని కొన్ని డిపోల పరిధిలో జిల్లా సర్వీసులు కూడా ఉన్నాయి. వీటిల్లో దూరప్రాంతాలకు వెళ్లేందుకు గరుడ బస్సులున్నాయి. ఈ ప్రీమియం కేటగిరీ బస్సులను ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లు తప్ప సాధారణ డ్రైవర్లు నడపలేరు.  ఇలాంటి డ్రైవర్లు పరిమితంగా ఉంటారు. తరచూ గరుడ బస్సు సర్వీసు బయలుదేరే వేళ వరకు కూడా సదరు డ్రైవర్‌ విధులకు రావడంలేదు. దీంతో అప్పటికప్పుడు మరో డిపో నుంచి డ్రైవర్‌ను పిలిపించటం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.

ఈ లోపు సమయం మించిపోయి ప్రయాణికులు ఆందోళన చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా కొన్ని దూరప్రాంత సర్వీసులు తరచూ ఆలస్యంగా నడపాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో రద్దు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా 16వ తేదీన మస్టర్స్‌ సిద్ధం చేసే సమయంలో కొందరు కార్మిక సంఘాల నేతలు రంగ ప్రవేశం చేసి, ముందస్తు అనుమతి లేకుండా విధులను ఎగ్గొట్టిన సిబ్బందికి మూడు రోజుల సెలవు నిబంధన వర్తింపజేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలా ఒక్కో డిపోలో వంద వరకు సెలవుల పంచాయితీ నెలకొంటోంది.

 తాజాగా ఆదివారం ఓ డిపోలో 66 మంది విధులకు డుమ్మా కొట్టారు. అయితే, ఆరోజు అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టడంతో కొన్ని రాజకీయపార్టీలు ఆందోళనకు దిగాయి. దీంతో అధికారులు సిటీలో ఏసీ బస్సులను నిలిపివేశారు. డుమ్మా కొట్టినవారి స్థానాల్లో ఇక్కడి డ్రైవర్లు, కండక్టర్లను ఆ రోజు విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు, మూడురోజులుగా డుమ్మా కొట్టిన పలువురు సిబ్బందిని డిస్మిస్‌ చేశారు. ఇప్పుడీ వ్యవహారం మరోసారి ఆర్టీసీలో వివాదానికి కారణమవుతోంది. 

మరిన్ని వార్తలు