బస్సెక్కారు.. బిస్స పట్టారు

30 Nov, 2019 02:08 IST|Sakshi
ఖమ్మం డిపోలో మహిళా కండక్టర్ల సంతోష క్షణాలు

55 రోజుల తర్వాత బస్సెక్కిన ఆర్టీసీ కార్మికులు

రాష్ట్రవ్యాప్తంగా కళకళలాడిన డిపోలు

సిబ్బంది మొత్తం విధులకు హాజరు

రిలీఫ్‌ల రద్దుతో కార్మిక నేతలూ విధుల్లోకి..

నేడు విపక్ష నేతలతో జేఏసీ లంచ్‌ మీటింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆర్టీసీ డిపోలు కళకళలాడాయి. 55 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కార్మికులు బస్సులెక్కారు. సొంత డ్రైవర్ల చేతికి తిరిగి బిస్స (స్టీరింగ్‌) వచ్చింది. సమ్మె విరమించి మూడు రోజులు నిరీక్షించాక ఎట్టకేలకు ముఖ్యమంత్రి వారిని విధుల్లోకి తీసుకునేందుకు అనుమతించటంతో, శుక్రవారం ఉదయమే పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయా డిపోలకు చేరుకున్నారు. సాధారణంగా 10 శాతం మంది కార్మికులు రోజూ వారాంతపు సెలవులో ఉంటారు.

హన్మకొండలో విధుల్లో చేరుతున్న మహిళా కండక్టర్‌

సగటున మరో 5 శాతం సెలవుల్లో ఉంటారు. కానీ కొలువు ఉంటుందో, ఊడుతుందో తెలియని ఊగిసలాట మధ్య సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన అవకాశం కావటంతో శుక్రవారం మొత్తం సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఫలితంగా డిపోల్లో పండగ వాతావరణం కనిపించింది. ఉద్యోగం పోలేదు, పదిలమే అన్న భావనతో రావటంతో పరస్పరం పలకరింతలు, మిఠాయిల పంపకాలు, ఆలింగనాలతో సంతోషంగా విధుల్లో చేరారు. కొందరు డ్రైవర్లు బస్సుల ముందు మోకరిల్లి స్టీరింగ్‌ చేపట్టడం విశేషం.

ముషీరాబాద్‌ డిపోలో కార్మికుల ఆనందం

40 శాతం బస్సులు అన్‌ఫిట్‌...
సమ్మె కాలంలో బస్సుల నిర్వహణ లేకపోవడం, తాత్కాలిక డ్రైవర్లు ఇష్టానుసారం నడపడంతో చాలా బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సగటున రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం బస్సులు కదలలేని స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. ఇన్ని రోజులు శ్రామిక్‌లూ సమ్మెలో ఉండటంతో వాటి నిర్వహణ పనులు సరిగా జరగలేదు. లారీ మెకానిక్‌లతో తాత్కాలిక మెయింటెనెన్స్‌ నిర్వహించినా అది సరిపోలేదు.

శుక్రవారం విధుల్లోకి రావటంతోనే శ్రామిక్‌లు యుద్ధప్రాతిపదికన వాటి మరమ్మతు, షెడ్యూల్‌ 1, 2, 3 మెయింటెనెన్స్‌ చేపట్టారు. దీంతో రాత్రికి సగం బస్సులు సిద్ధమయ్యాయి. శుక్రవారం మాత్రం 60 శాతం బస్సులతోనే నెట్టుకొచ్చారు. దీంతో మిగతా డ్రైవర్లు, కండక్టర్లు డిపోల్లో ఖాళీగా ఉండిపోయారు. ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో బస్సులను తిప్పుతామని అధికారులు పేర్కొన్నారు.

యాదగిరిగుట్ట డిపోలో మహిళా కండక్టర్ల చిరునవ్వులు

కార్మిక నేతలకు రిలీఫ్‌లు కట్‌...
ఆర్టీసీలో చాలాకాలంగా గుర్తింపు కార్మిక సంఘాల్లోని కొందరు ప్రతిని ధులకు రిలీఫ్‌ వసతి కొనసాగుతోంది. వారు విధుల్లోకి రాకున్నా హాజ రైనట్టే పరిగణిస్తారు. రాష్ట్రస్థాయిలో 24 మంది ప్రతినిధులకు పూర్తి రిలీఫ్‌గా 365 రోజులు విధుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. డిపో స్థాయిలో ఇద్దరికి ఒకరోజు చొప్పున, కొందరికి 2 రోజుల చొప్పున రిలీఫ్‌ ఉంటుంది. తాజాగా వాటిని యాజమాన్యం రద్దు చేసింది.

దీంతో ప్రధాన నేతలు మినహా మిగిలినవారు శుక్రవారం విధులకు హాజరయ్యారు. ఓ సంఘం రాష్ట్ర ప్రధాన నేత కారు డ్రైవర్‌గా ఆర్టీసీ డ్రైవరే పనిచేస్తున్నాడు. అతడు కూడా శుక్రవారం సంబంధిత డిపోలో విధులకు హాజరయ్యాడు.

కార్మిక నేతలపై అధికారుల కన్ను...
కార్మిక సంఘాల నేతలతోనే ఆర్టీసీకి సమస్యలు వచ్చి పడ్డాయంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డ నేపథ్యంలో అధికారులు కార్మిక నేతలపై దృష్టి సారించారు. వారికి ఉన్న వసతులు తొలగించటంతోపాటు కార్మికులు వారితో ‘టచ్‌’లో లేకుండా చూస్తున్నారు. వారితో తిరిగితే మళ్లీ ఉద్యోగానికే ఇబ్బంది వస్తుందని, నష్టాల్లో ఉన్న సంస్థను వీలైనంత మేర ఆదాయాన్ని పెంచి చూపాలంటూ దాదాపు అన్ని డిపోల్లో గేట్‌ మీటింగ్స్‌ నిర్వహించి హితబోధ చేశారు. వీలైనంత వరకు సమ్మెకు నేతృత్వం వహించిన ప్రధాన నేతలను ఏకాకి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

శుక్రవారం ప్రధాన నేతలెవరూ విధుల్లోకి రాలేదు. ఇక జేఏసీ నేతలు సమావేశమై సమ్మెకు సంఘీభావం తెలిపిన వారందరికీ ధన్యవాదా లు తెలిపారు. రిలీఫ్‌లు తొలగించటం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. అది చిల్లర పనిగా అభివర్ణించారు. ఆర్టీసీ నష్టాలకు అధికారుల ఇష్టారాజ్యమే కారణమన్నారు. శనివారం అన్ని విపక్ష నేతలను ఆహ్వానించి సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు చెప్పనున్నారు. వారితో కలిసి లంచ్‌ చేయనున్నారు. జీతాలు అందాక, ఇటీవల మృతిచెందిన కార్మికుల కుటుంబాల కు ఆర్ధికసాయం చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకరోజు మొత్తమా లేదా నిర్ధారిత మొత్తమా అన్నది ఖరారు చేయాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా