సమ్మె ఉద్రిక్తం..

8 May, 2015 00:05 IST|Sakshi

రెండో రోజూ కదలని బస్సులు
సంగారెడ్డిలో ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్
గుండెపోటుకు గురైన కండక్టర్..
దుబ్బాకలో మోకాళ్లపై నిలబడి నిరసన
జహీరాబాద్‌లో కబడ్డీ ఆడిన కార్మికులు
గజ్వేల్‌లో నిరసన ర్యాలీ
సంగారెడ్డి, ఆర్సీ పురంలో సీఎం దిష్టిబొమ్మల దహనం

 
ఆర్టీసీ సమ్మె రెండో రోజై న గురువారం జిల్లాలో ఉధృతమైంది. అదే సమయంలో ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పోలీసుల సహకారంతో బస్సులను నడపాలని ప్రయత్నించిన అధికారులు కార్మికుల ప్రతిఘటనతో విఫలమయ్యారు. సంగారెడ్డిలో ఓ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఆందోళనలో పాల్గొన్న మరో కండక్టర్ గుండెపోటుకు గురి కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుబ్బాకలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అక్కడే వంటావార్పు నిర్వహించారు.

మెదక్‌లో కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బస్సుల కింద పడుకొన్న కార్మికులను పోలీసులు లాగేశారు. సిద్దిపేట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు బస్సుల టైర్ల నుంచి గాలి తీసేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ డిపో ఎదుట కార్మికులు కబడ్డీ, వాలీ బాల్ ఆడి నిరసన తెలిపారు. సంగారెడ్డి, రామచంద్రాపురంలో సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు.
 
సంగారెడ్డిమున్సిపాలిటీ/సంగారెడ్డి క్రైం: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా రెండో రోజైన గురువారం కూడా జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 8 గంటలకే కార్మికులు సంగారెడ్డి డిపో ఎదుట బైఠాయించారు. పట్టణ ఎస్‌ఐ రమేష్ కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో డ్రైవర్ అనిల్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ కిరోసిన్ డబ్బాను పైకి లేపగానే తోటి కార్మికులు, పోలీసులు లాగేసుకున్నారు.

అనంతరం పట్టణ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ వెంకటేష్, డీఎస్పీ తిరుపతన్న డిపో వద్దకు చేరుకొని బస్సులు నడిచేందుకు సహకరించాలని కార్మికులను కోరారు. అందుకు కార్మికులు అంగీకరించలేదు. కొద్దిసేపు డీఎస్పీతో వాగ్వాదానికి దిగా రు. కార్మికులను అరెస్టు చేసేందుకు పో లీసు వాహనాలను సిద్ధం చేస్తున్న క్రమం లో కండక్టర్ అంజయ్య గుండెపోటుకు గురై అక్కడే పడిపోవడంతో కార్మికులు వెంటనే అతణ్ణి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ దశలో పోలీసులు వారిని అరెస్టు చేయకుండా వెనుదిరిగారు.

బెడిసికొట్టిన పోలీసుల వ్యూహం...
 సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో కొన్ని బస్సులనైనా నడిపించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆర్‌ఎం రాజుతోపాటు జిల్లాలోని డీఎస్పీలతో బుధవారం అర్ధరాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

పోలీసుల పటిష్టమైన బందోబస్తు మధ్య బస్సులు నడిపించాలని సూచించారు. ఒక్కో బస్సుకు ఇద్దరు నుంచి ఐదుగురిని ఎస్కార్ట్‌గా నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు పోలీసు పహారా పెంచారు. ప్రత్యేక బలగాల మధ్య బస్సులను నడిపించేందుకు యత్నించారు. ఎక్కడికక్కడ కార్మికులు అడ్డుకోవడంతో వారి ప్రయత్నం బెడిసికొట్టింది.

నడిచింది 5 బస్సులు మాత్రమే...
 కార్మికుల సమ్మె కారణంగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 55 సర్వీసులను నడిపించినట్లు ఇన్‌చార్జి ఆర్‌ఎం రాజు తెలిపారు. ఇందులో 50 ప్రైవేట్ బస్సులు, 5 ఆర్టీసీ బస్సులు నడిచినట్టు ఆయన పేర్కొన్నారు. రెండో రోజు సమ్మె కారణంగా జిల్లాలో కోటి రూపాయల వరకు సంస్థకు నష్టం వాటిల్లిందని తెలిపారు.

సమ్మె ఆపేది లేదు: టీఎంయూ నేత పీరయ్య
 సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ‘ఎస్మా’ ప్రయోగిస్తామని సర్కార్ హెచ్చరించినా బెదిరేది లేదని టీఎంయూ రీజినల్ కన్వీనర్ పీరయ్య అన్నారు. ప్రాణాలు పోయిన తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు.

సీఎం దిష్టిబొమ్మ దహనం
 ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంగారెడ్డిలోని ప్రధాన రహదారిపై కార్మికులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. కార్మికుల సమ్మెకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికుల ఆందోళనలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు సంబరపడి కేసీఆర్‌కు మద్దతిచ్చిన కార్మికులే ఇప్పుడు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు సమ్మె చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదని... టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంస్థ అయిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూడా సమ్మెలో పాల్గొనడం గొప్పవిషయమన్నారు.

సమ్మె చేస్తున్న అధికార యూనియన్‌కు కేబినెట్ మంత్రి టి.హరీశ్‌రావు గౌరవ అధ్యక్షునిగా ఉండి కార్మికుల సమస్యలను విస్మరించడం ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. పది నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

భెల్ డిపో ఎదుట నిరసన...
 రామచంద్రాపురం: ఆర్టీసీ కార్మికులు గురువారం ఉదయం భెల్ డిపో ఎదుట బైఠాయించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు మొగులయ్య, శ్రీనివాస్, వెంకటేశం, మల్లేశం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు