నిబంధనలు గాలికి..

7 Mar, 2018 09:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెట్రోల్‌ బంకుల్లో కానరాని సౌకర్యాలు

గాలి నింపే యంత్రాలు, మరుగుదొడ్లు కరువు

వినియోగదారులకు ఇక్కట్లు 

భద్రతా ప్రమాణాలు  అంతంతే..

బీర్కూర్‌: పెట్రోల్‌ బంకుల యజమానులు నిబంధనలను గాలికొదిలేశారు. బంకుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోజురోజుకు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నా.. పెట్రోల్‌ బంకుల్లో వసతులు మాత్రం మెరుగవ్వడం లేదు. వివిధ రకాల పన్నుల పేరిట 35 శాతం వరకు ట్యాక్స్‌ వసూలు చేస్తున్న ప్రభుత్వాలు.. బంకుల్లో వినియోగదారుల సౌకర్యాలపై దృష్టి సారించడం లేదు. భద్రతా ప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. కొన్ని బంకుల్లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఉండటం లేదు. 

గాలికొట్టే యంత్రాలేవి? 
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 180 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్‌ బంకుల్లో గాలి నింపే యంత్రాలు ఉండాలి. కోరిన ప్రతి వినియోగదారునికి ఉచితంగా గాలి నింపాలి. కానీ కొందరు బంకు నిర్వాహకులు ఖర్చుతో కూడుకున్న పనిగా భావించి వాటిని ఏర్పాటు చేయడం లేదు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం లేదు. ఇక, ఉచితంగా గాలి నింపాల్సి ఉండగా, వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. 

డిజిటల్‌ లావాదేవిలపై అనాసక్తి 
పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు కొరతను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేలా అన్ని పెట్రోల్‌ బంకుల్లో స్వైప్‌ (పీవోఎస్‌) మిషన్లను ఉపయోగించాలని స్పష్టం చేశాయి. అయితే, చాలా బ్యాంకుల్లో పీవోఎస్‌ యంత్రాలను మూలన పడేశారు. ఎవరైనా ఏటీఎం కార్డు లావాదేవీలను అసలే అంగీకరించట్లేదు. ఏమైనా అంటే పీవోఎస్‌ మిషన్‌ చెడిపోయిందని సమాధానమిస్తున్నారు. బంకులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నా సంబంధిత శాఖలు స్పందించడం లేదు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ టాస్క్‌ఫోర్సు బృందం బంకుల్లో తనిఖీలు చేపట్టి నిబంధనల ప్రకారం వినియోగదారులకు మెరుగైన వసుతులతో పాటు డిజిటల్‌ లావాదేవీలు అందుబాటులోకి తేవాలని వినియోగదారులు కోరుతున్నారు.

నాణ్యతా ప్రమాణాలు అంతే..

వాహనదారులు పెట్రోల్, డీజిల్‌ నాణ్యతపై అనుమానం వస్తే, తక్షణమే నివృత్తి చేసే ఉపకరణాలు అందుబాటులో ఉండాలి. నాణ్యత నిర్ధారణకు ఫిల్టర్‌ పేపర్, డెన్సిటీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలి. కానీ వాహనదారులకు ఆయా నిబంధనలపై అవగాహన లేకపోవడంతో బంకుల యాజమాన్యాల ఇష్టారాజ్యం నడుస్తోంది. అవగాహన ఉన్న వారు అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.

భద్రతా చర్యలు అంతంత మాత్రమే 
పెట్రోల్‌ బంకుల్లో భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే దర్శనమిస్తున్నాయి. బంకుల్లో ఇసుక బకెట్లు, అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అలంకార ప్రా యంగానే ఉంటున్నాయి. వాహనదారు లు అటుంచి, బంకు నిర్వాహకులే సె ల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పెట్రోల్‌ పోస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. 

కానరాని శౌచాలయాలు
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బంకులో మరుగుదొడ్లతో పాటు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా షెడ్డు ఉండాలి. కానీ చాలా చోట్ల టాయిలెట్‌ సౌకర్యమే లేకపోవడంతో వినియోగదారులు ముఖంగా మహిళలు ఇబ్బం ది పడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభు త్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న స్వచ్ఛభారత్‌ కల సాకారం కాకుండా పోతోంది. 

మరిన్ని వార్తలు