అక్రమ లే అవుట్‌లకు అనుమతిస్తే కొరడా 

25 Jan, 2019 00:47 IST|Sakshi

పంచాయతీ పాలకవర్గాన్ని రద్దు చేసేలా చట్టంలో నిబంధనలు  

సాక్షి, హైదరాబాద్‌: నిర్దేశిత నిబంధనల ప్రకారం లేని లే అవుట్‌లకు అనుమతి ఇస్తే గ్రామపంచా యతీ పాలకవర్గాన్ని రద్దు చేసే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో చేర్చింది. నగరాలు, పట్టణాల శివారుల్లోని గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 2018 మార్చి 31 వరకు ఉండే లే అవుట్ల జాబితాలను కొత్త పాలకవర్గాలు ప్రకటించి.. అనంతరం వాటిపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చే ముందు వ్యవసాయ భూమి చట్టం కింద రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భూ మార్పిడి ప్రక్రియ తర్వాతే లే అవుట్‌ ప్రతిపాదన దరఖాస్తును గ్రామపంచాయతీలకు ఇవ్వాలి. గ్రామపంచాయతీలు దీన్ని 7 రోజుల్లో జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) అనుమతి జారీ చేసే సంస్థలకు పంపాలి. ఈ గడువులోపు గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. లే అవుట్లలో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు వ్యవస్థ ఏర్పాటు చేయాలని సాంకేతిక కమిటీ లే అవుట్‌ నిర్వాహకులకు చెబుతుంది. అనంతరం లే అవుట్‌ పరిధిలోని సామూహిక స్థలాలు, రోడ్లను గ్రామపంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాలి. అన్నింటినీ పరిశీలించి డీటీసీపీ నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. లే అవుట్‌ నిర్వాహకులు విక్రయానికి ప్రతిపాదించే మొత్తం స్థలంలో 15 శాతాన్ని గ్రామపంచాయతీకి తనఖా పెట్టాలి. గ్రామ కంఠం స్థలానికి ఈ నిబంధనలు వర్తించవు. లే అవుట్‌లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. డీటీసీపీ కమిటీ ఆదేశాలు లేకుండా లే అవుట్‌కు అనుమతి ఇస్తే గ్రామపంచాయతీ పాలకవర్గం రద్దవుతుంది.  

చట్టంలో క్రమబద్ధీకరణ అంశం.. 
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ అంశాన్నీ చట్టంలో పొందుపరిచారు. లే అవుట్‌లో నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా వసతులు లేనప్పుడు అది అక్రమం అవుతుంది. నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించిన తర్వాత లే అవుట్లను క్రమబద్ధీకరిస్తారు. లే అవుట్‌కు వినియోగించే స్థలానికి అప్పటి మార్కెట్‌ విలువతో పోల్చితే పది శాతం గ్రామపంచాయతీకి చెల్లిస్తే క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఉంటుంది. అక్రమ లే అవుట్‌లో వసతులు కల్పించే విషయంలో విఫలమైతే దాన్ని అక్రమంగానే నిర్ధారిస్తారు. ఎంత మొత్తం చెల్లించినా దీన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉండదు.   

మరిన్ని వార్తలు