పద్ధతి మార్చుకో.. లేకుంటే జైలుకే..!.

23 Oct, 2014 05:16 IST|Sakshi
పద్ధతి మార్చుకో.. లేకుంటే జైలుకే..!

* వసూళ్లు ఆపెయ్..
* అధికార పార్టీ ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ క్లాస్

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున పోటీచేసి మొదటిసారి గెలిచిన ఓ ఎమ్మెల్యే తీరు జిల్లాలో వివాదాస్పదంగా మారింది. వ్యాపారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అనే తేడా లేకుండా సంబంధిత ఎమ్మెల్యే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ విచ్చలవిడిగా డబ్బుల వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన కొద్దిరోజుల్లోనే గ్రానైట్ వ్యాపారులను సమావేశపర్చి ‘మీరంతా ఇకపై నేను చెప్పినట్లే వినాలి. మీరేం చేస్తారో నాకు తెల్వదు. నాకు వెంటనే కార్ కొనియాల్సిందే’ అని హుకుం జారీ చేసినట్లు తెలిసింది.

అసలే గ్రానైట్ వ్యాపారం....అందులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేతో తలనొప్పులెందుకని అనుకున్న వ్యాపారులంతా తలా కొంత మొత్తం డబ్బు జమచేసి విలువైన వాహనాన్ని కానుకగా ఇవ్వడం బహిరంగ రహస్యమే. అంతటితో ఆగని సదరు ఎమ్మెల్యే పోలీసులు, అధికారుల బదిలీల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. చివరకు ఏదో ఒక పని కోసం తన వద్దకు వచ్చే వారితోపాటు తగాదాలను పరిష్కరించేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు సొంత పార్టీ నేతలు పని కోసం వెళ్లినా ‘నేనేమన్నా వట్టిగ గెలిసిన్నా... నాకు ఖర్చు కాలేదా... డబ్బులు తీసుకొంటే తప్పేంది..? ఎమ్మెల్యేగ గెలిచిన... ఇక ఐదేండ్లు నన్నేం చేస్తరు’ అంటూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ విషయాన్ని కొందరు నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వాపోయినట్లు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యే వ్యవహారశైలిపై ఇంటిలెజెన్స్ నివేదిక తెప్పించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఎమ్మెల్యే ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్న విషయం వాస్తవమేననే నిర్ధారణకు వచ్చారు. ఐదు రోజుల క్రితం సదరు ఎమ్మెల్యేలను హైదరాబాద్ పిలిపించుకుని తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలిసింది. కేసీఆర్ హెచ్చరికతో కంగుతిన్న సదరు ఎమ్మెల్యే వివరణకు ప్రయత్నించినా, సీఎం వినలేదని సమాచారం.
 
ఎమ్మెల్యే కాకముందు..
వాస్తవానికి ఎమ్మెల్యే కాకముందు సదరు లీడర్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకదశలో కుటుంబ నిర్వహణ కూడా కష్టసాధ్యమైన పరిస్థితిని ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే ప్రజల్లో మంచి పేరుండటం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తుండటంతో ఈ విషయాన్ని గమనించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సదరు లీడర్‌కు నెలనెలా కొంత మొత్తాన్ని పంపినట్లు తెలిసింది.

కేసీఆర్ సన్నిహితుడొకరు స్వయంగా ఆ డబ్బును సదరు లీడర్‌కు అందజేసేవారు. మొన్నటి ఎన్నికల్లోనూ ప్రచార ఖర్చు కింద సదరు లీడర్‌కు కేసీఆర్ పెద్ద మొత్తం పంపినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో గెలిచిన తరువాత సదరు లీడర్ వ్యవహారశైలిలో మార్పు రావడం, సొంత పార్టీ నేతలు సహా అందరినీ హడలెత్తిస్తూ వసూళ్ల పర్వానికి తెరతీయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. సదరు ఎమ్మెల్యే తీరువల్ల పార్టీకి చెడ్డపేరొస్తుందని కొందరు నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇక లాభం లేదనుకున్న కేసీఆర్ సదరు ఎమ్మెల్యేను పిలిచి గట్టిగా మందలించినట్లు తెలిసింది. జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ప్రస్తుతం ఈ అంశమే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వార్తలు