రన్...రన్

19 Apr, 2014 00:38 IST|Sakshi
రన్...రన్
  •      పార్టీల ఉరుకులు పరుగులు
  •      ఊపందుకున్న ప్రచారం
  •      నేటి నుంచి నగరంలో కేసీఆర్ తెలం‘గానం’
  •      రేపటి నుంచి షర్మిల వైఎస్సార్‌సీపీ జనభేరి
  •      మోడీ రాక కోసం కమలనాథుల ఏర్పాట్లు
  •      అయోమయంలో కాంగ్రెస్ ప్రచార వ్యూహం
  •  సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికలు ‘కీ’లక దశకు చేరుకున్నాయి. ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు రకరకాల ఫీట్లు చేస్తూ నానాపాట్లు పడుతున్నారు. ప్రస్తుతం వివిధ పార్టీల అధినేతలూ రంగంలోకి దిగనున్నారు. ప్రచారాస్త్రాలకు పదును పెట్టి పరుగులు పెట్టనున్నారు. శనివారం నుంచి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నగరంలో ప్రచారం ప్రారంభిస్తుండగా.. ఆదివారం నుంచి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత వైఎస్ షర్మిల జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి జనభేరిని మోగించనున్నారు.

    నగరంలో పలు స్థానాలపై ఆశలు పెంచుకున్న బీజేపీ ఈ నెల 22న పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సభకు విస్తృత ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం జైరాం రమేష్, కొప్పుల రాజుల మీదే ఆధారపడి నగరంలో ప్రచారసభలు నిర్వహిస్తోంది.
     
    పది సభలకు టీఆర్‌ఎస్ సన్నాహాలు
     
    నగరంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపని టీఆర్‌ఎస్ ఈ మారు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. నగరంలో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నప్పటికీ కొన్ని స్థానాలపైనే ఆశలు పెట్టుకుంది. తొలి సభను మల్కాజిగిరి శాసనసభ పరిధిలోని అల్వాల్‌లో శనివారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇదే తరహాలో మరో తొమ్మిది సభలకు సన్నాహాలు చేస్తోంది. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పారిశ్రామికవేత్త కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలోనే కేసీఆర్ ఏడు సభలు పెట్టే అవకాశం ఉంది.
     
    మోడీపైనే కమలనాథుల ఆశలు
     
    నగరంలో పలు స్థానాలపై కన్నేసిన బీజేపీ తమ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపైనే ఆశలు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సమన్వయం కొరవడి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మొదలుకుని క్యాడర్ అంతా ఇతర పార్టీల్లో చేరిపోయింది. మిగిలిన కొద్దిమంది నాయకులు ఇతర పార్టీలతో రాయ‘బేరాలు’ మొదలు పెడుతుండటంతో టీడీపీపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దంటూ బీజేపీ తమ శ్రేణులకు సందే శాలను పంపుతోంది. ఈ నెల 22న నగరంలో నిర్వహించే మోడీ సభ విజయవంతం తర్వాత అదే ఊపుతో ముందుకు వెళ్లే ఆలోచనతో ఉంది.
     
    కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ వారే..
     
    నగరంలో కాంగ్రెస్ పార్టీకి ప్రచార సారథులు కరువయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులంతా గట్టి పోటీ ఎదుర్కొంటూ ఉండటంతో.. వారు ఇతర నియోజకవర్గాల్లోకి వెళ్లలేని పరిస్థితి. ప్రజల్లో ఏ మాత్రం గుర్తింపు లేని కేంద్ర నాయకులు జైరాం రమేష్, కొప్పుల రాజులను ఆయా సభలకు ఆహ్వానిస్తున్నప్పటికీ వారితో తమకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదని పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు. వెరసి ఎవరికి వారే ప్రచారాన్ని నిర్వహిస్తుండటంతో ఆయా కాలనీ, బస్తీ వాసుల నుంచి పెద్దగా స్పందన రావటం లేదు. దీంతో నగరంలో సినీనటులు జయప్రద, జయసుధ, విజయశాంతిలను రంగంలోకి దింపే యోచనలో పార్టీ నేతలున్నట్లు సమాచారం.
     

మరిన్ని వార్తలు