నెక్కొండలోని తండాకి తప్పని తంటాలు..

17 Nov, 2018 11:30 IST|Sakshi
పనులకు, సూరుపల్లికి వెళ్లడానికి వాగు దాటుతున్న తండా ప్రజలు

నెక్కొండకు కూత వేటు దూరంలో మంగల్‌తండా

తండాలో అన్నీ సమస్యలే     పట్టించుకోని పాలకులు

సాక్షి, చెన్నారావుపేట: హైటెక్‌ యుగంలా రోజు రోజుకూ పల్లెటూళ్లు సైతం పట్టణాల వసతులతో అభివృద్ధి చెందుతున్నాయి. కానీ నెక్కొండకు కూత వేటు దూరంలో ఉన్న ఆ తండా మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎన్నికల వేళ అభివృద్ధి చేస్తామని వచ్చిన ప్రజాప్రతినిధులు ఎన్నికల అనంతరం అటు వైపుగా కూడా చూడకపోవడంతో ఆ తండా అభివృద్ధికి నోచుకోలేదు. ఆస్పత్రికి వెళ్లాలన్నా, విద్యార్థులు చదువుకు పోవాలన్నా.. ఎరువులు, పురుగుల మందలు, కిరాణం సమాను తెచ్చుకోవాలన్నా వారి కష్టాలు అంతా ఇంతా కాదు. మా ఓట్లు వారికి కావాలే కానీ మా బాగోగులు వారికి పట్టడం లేదని తండా ప్రజలు ఆరోపిస్తున్నారు. 

వివరాలు..  వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మంగల్‌ తండాలో 52 ఇండ్లు ఉన్నాయి. సుమారుగా 200 పైగా జనాభా ఉంది. మహిళా ఓటర్లు 43 మంది, పురుషులు 36 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి ఓట్లు వేస్తే తండాలో మౌళిక వసతులు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. ఓట్లు వేసుకున్నాక మళ్లీ కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరపల్లికి వెళ్లి రేషన్, తెచ్చుకోవాలన్న, గ్రామ పంచాయతీ పనుల కోసం వెళ్లాలన్నా ట్యూబ్‌ల సహాయంతో వాగు దాటుతున్నామని చెప్పారు. వ్యవసాయ పనులకు వెళ్లాలన్న వాగు దాటాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు.. సోలర్‌ వాటర్‌ ట్యాంకు కొన్ని పనిచేసి మరమ్మతులకు గురైంది. దానిని బాగు చేసే వారు లేరు. 

30 కి.మీ తిరిగి రావాల్సిందే..
పిల్లలతో వాగు దాటలేని పరిస్థితి.. వాగు ఉధృతిగా ఉన్నప్పుడు రేషన్‌ సరుకులు, ఇతర పనులకు కోసం నెక్కొండ మీదుగా 30 కిలోమీటర్లు తిరిగి సూరుపల్లికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోడ్డు కూడా గుంతలతో ప్రమాదకరంగా ఉంది. బైక్, సైకిళ్లు, కాలినడకన మాత్రమే తండాకు పోవా ల్సి ఉంటుంది. నాలుగు చక్రాల వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. చదువుకోవడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యాలకు గురైనప్పుడు పరిస్థితి కష్టతరంగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఏది ఏమైన నెక్కొండ పట్టణానికి ఆమడ దూరంలో ఉండి కూ డా అభివృద్ధి చెందలేదంటే ప్రజాప్రతినిధులు, అ ధికారుల పనితీరు ఎలా ఉందో అర్ధం అవుతుంది.

ఒకే తండా రెండు గ్రామ పంచాయతీలు..
తండాలో 52 ఇండ్లు ఉన్నాయి. అందులో రోడ్డుకు ఓ వైపు సుమారుగా 40 వరకు ఇండ్లు సూరుపల్లి గ్రామ పంచాయతీలో ఉంటే మరో వైపు 12 ఇండ్లు మడిపల్లి గ్రామ పంచాయతీకి వెళ్లింది. ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది.

రోడ్డు బాగాలేదు..
కంట్రోల్‌ బియ్యం తెచ్చుకోవాలంటే సూరుపల్లికి పోవాలి. ఓటు వేయాలన్నా సూరుపల్లికి పోవాలి. జ్వరం వస్తే నెక్కొం డకు పోవాలి. కానీ రోడ్డు బాగాలేదు. ఆటోలు రావు. ఎవరికైనా బండి ఉంటే తీసుకెళ్తారు.. లేదంటే నడిచి వెళ్తాం. ఇప్పటికైనా పట్టించుకోని మాకు రోడ్డు వేయాలి.– బానోతు లక్ష్మీ, మంగల్‌ తండా వాసి

వాగుపై వంతెన కట్టాలి.. 
మాకు సూరుపల్లి గ్రామ పంచాయతీ ఉంది. అక్కడికి పోవాలంటే వాగును ట్యూబ్‌లతో దాటుతున్నాం. ఇబ్బందిగా ఉంది. తండాలో కొన్ని ఇండ్లు మడిపెల్లిలో కలిపారు. అన్ని మడిపెల్లిలో కలపాలి. లేదంటే వాగుపై వంతెన నిర్మించాలి. తండాలో అన్నీ ఇబ్బందులే. ఎవరూ పట్టించుకోరు. ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారో వారికే ఓటు వేస్తాం. – గుగులోతు కున్నా, తండా వాసి 

మరిన్ని వార్తలు