ప్రభుత్వాస్పత్రిలో ఆత్మహత్య

9 Oct, 2014 03:58 IST|Sakshi

కరీంనగర్ క్రైం/తిమ్మాపూర్ :
 మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడు జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో బుధవారం ఉరేసుకున్నాడు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి చెందిన గుమ్మడి వెంకన్న(30) తల్లి కనుకవ్వతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. తండ్రి గతంలోనే మరణించగా సోదరికి వివాహమైంది. వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. మానసికవ్యాధితో పడుతున్న అతడు చస్తానని తరచూ ఇంట్లో బెదిరిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి ఇలాగే మాట్లాడుతూ మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు గ్రామ శివారులో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ముట్టుకున్నాడు.

షాక్ కొట్టడంతో కిందపడిపోయాడు. అక్కడే నిద్రిస్తున్న గొర్రెల కాపరులు శబ్ధం కావడంతో లేచిచూసి గ్రామస్తులకు సమాచారమందించారు. వారు వెంకన్నను తీసుకెళ్లి ఓ ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స అనంతరం రాత్రి 12 గంటల ప్రాంతంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం సిద్ధం చేస్తుండగా వేకువజామున 3 గంటల ప్రాంతంలో బాత్రూమ్‌కు వెళ్లాడు. లోపల గడియపెట్టుకుని వెంటిలేటర్‌కు తన వద్ద ఉన్న లుంగీతో ఉరేసుకుని బయటకు దూకాడు. అతడు ఎంతసేపటికి బాత్రూమ్‌నుంచి రాకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా బయటివైపు ఉరేసుకుని మరణించి కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నరేందర్ తెలిపారు. ఆస్తులేం లేకుండా తల్లిని ఎలా సాకాలని మనోవేదనకు గురవుతుండేవాడని కుటుంబసభ్యులు తెలిపారు.

 జీల్గులలో విద్యార్థిని..
 జీల్గుల(ఎల్కతుర్తి) : జీల్గులకు చెందిన రావుల అనూష(14) అనే విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న అనూషను పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. బాధ భరించలేక బుధవారం వేకువజామున ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు గమనించి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందుతుండగానే పరిస్థితి విషమించి చనిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాచినేని రవి తెలిపారు.

 అర్పపల్లిలో వివాహిత..
 సారంగాపూర్ : అర్పపల్లికి చెందిన రేష్మ(23) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. రేష్మ సోదరి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మరణించగా ఆమె భర్తకు రేష్మతో ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరి మధ్య వయసు 20 ఏళ్ల తేడా ఉంది. రేష్మకు ఇష్టం లేకపోవడంతో నాలుగు నెలల క్రితం విడాకులు తీసుకుంది. తన జీవితం నాశనమైపోయిందని మనోవేదన చెందేది. ఇక బతకడం వృథా అనుకుని బుధవారం ఉదయం ఇంట్లోనే చున్నీతో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌజ్ అధికారి శంకరయ్య తెలిపారు.

 యామన్‌పల్లిలో యువకుడు...
 మహాముత్తారం :  మండలంలోని యామన్‌పల్లికి చెందిన రామటెంకి అశోక్(20)అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగగా.. తర్వాత గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  

 మద్యానికి బానిసై ఒకరు..
 కమాన్‌పూర్ : మండలంలోని జూలపెల్లికి చెందిన దాంపెల్లి సురేశ్(35) కూలీ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. పనికికూడా వెళ్లడం లేదు. కుటుంబ పోషణ భారం కావడంతో మనస్థాపం చెందిన ఉదయం ఇంట్లో ఉరివేసుకున్నట్లు కమాన్‌పూర్ ఏఎస్సై అన్వర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రాధ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా