రూ.వందకోట్లతో మాస్టర్‌ప్లాన్

11 Jan, 2015 04:03 IST|Sakshi
రూ.వందకోట్లతో మాస్టర్‌ప్లాన్

వేములవాడ అర్బన్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని రూ.వంద కోట్లతో మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను శనివారం ఉదయం మంత్రి ప్రారంభించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రూ.21 కోట్లతో స్వామి వారి విమానగోపురానికి బంగారు తాపడం చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 17న రాజన్న సన్నిధిలో జరుపుకునే మహాశివరాత్రి జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు భద్రాచలం మాదిరిగా జీవో జారీ చేస్తామన్నారు. గోదావరిఖని పుష్కరాలను రూ.500 కోట్లతో ఘనంగా నిర్వహిస్తామన్నారు.
 
కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు వైభవం తీసుకొస్తానని అన్నారు. తెలంగాణ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జోన్లుగా విభజించి పుణ్యక్షేత్రాలన్నింటినీ మోగా టూరిస్ట్ సర్క్యూట్ ద్వారా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
 
రాజన్న సన్నధిలో మంత్రి పూజలు
ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసమేతంగా రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ కలశంతో స్వాగతం పలికారు. మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షిణలు చేశారు. శ్రీలక్ష్మిగణపతి పూజ, నందీశ్వరుడికి పూలదండ సమర్పించుకుని, స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అద్దాల మంటపంలో ఈవో దూస రాజేశ్వర్ స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం అందించి సత్కరించారు.

మరిన్ని వార్తలు