అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్‌ ఖాతా తెరవాలి

12 Nov, 2018 16:49 IST|Sakshi

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ 

ఖమ్మంసహకారనగర్‌: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్‌ ఖాతాను తెరి చి ఖాతా నంబర్‌ను నామినేషన్‌ ఫారంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. అనంతరం రిట ర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా బ్యాలెట్‌ యూనిట్, కంట్రోల్‌ యూనిట్, వీవీ ప్యాట్లను కేటాయించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థు లు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలను సమర్పించాలని చెప్పారు. నామినేషన్‌తో పాటు ఫారం–26 అఫిడవిట్‌లో అభ్యర్థి పెండింగ్‌ నేర చరిత్ర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్‌ ఫారం–26లో సమర్పించిన అభ్యర్థి నేర చరిత్ర పెండింగ్‌ వివరాలను నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థి, రాష్ట్రస్థాయిలో అభ్యర్థికి సంబంధించిన రాజకీయ పార్టీ పోలింగ్‌ కంటే రెండు రోజుల ముందు వరకు కనీసం మూడుసార్లు సర్క్యులేషన్‌ కలిగిన పేపర్‌లో, కేబుల్‌ టీవీలో ప్రచారం, ప్రసారం చేయాలని పేర్కొన్నారు.

 మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తయిన ఈవీఎంలను నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రవాణా చేస్తామని, నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థులు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను పాటించాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎంకే ఆయేషా, సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, రిటర్నింగ్‌ అధికారులు జె.శ్రీనివాసరావు, ఆర్‌.దశరథ్, బి.శివాజీ, ఇన్‌చార్జ్‌ డీఆర్వో మదన్‌గోపాల్, ఎన్నికల డీటీ రాంబాబు, వివిధ పార్టీల నాయకులు ప్రకాష్, సింహాద్రి యాదవ్, శింగు నర్సింహారావు, విద్యాసాగర్, ప్రదీప్, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు