రైతుబంధు చెక్కులు ఇప్పించాలి

28 May, 2018 11:48 IST|Sakshi
ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న ఆదివాసీలు

ఖానాపూర్‌ : కడెం మండలం బెల్లాల్‌ గ్రామానికి చెందిన తమ భూములను టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడి చెర నుంచి కాపాడాలని గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఆదివారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంబందిత నాయకుడు ఇదివరకు తమ భూములు పెద్ద సంఖ్యలో కబ్జాకు పాల్పడ్డాడని, సాగులో ఒక్కొక్కరికి ఐదెకరాలకు పైగా ఉన్నప్పటికీ ఒక్కో ఎకరంతో పట్టాలు వచ్చాయని అన్నారు. కబ్జాపోను మిగిలిన ఒక్కో ఎకరం భూమికి ప్రభుత్వం రైతుబంధు ద్వారా చెక్కులు ఇస్తే వాటిని కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.

గ్రామ శివారులో గల జగిత్యాల నియోజకవర్గం రాయికల్‌ మండలం బోర్నపెల్లిలో ఉన్న తమ భూములకు ప్రభుత్వం నుంచి రైతుబంధు ద్వారా వచ్చిన చెక్కులను ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ విషయమై ఎంతటివారైనా సరే  తాను సంబందిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెడ్మ గంగు, తోడసం గంగు, వెడ్మ లింగు, వెడ్మ దేవేందర్, ఆత్రం గంగు, లింబారావ్, బాదిరావ్, లింగు, మోహన్, జుగాదిరావ్, శ్రీను, జ్యోతిరాం, మారుతి, ఆనంద్, బుచ్చవ్వ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు