1,44,000 : జిల్లా రైతు బీమా సభ్యుల సంఖ్య..!

8 Jul, 2018 08:27 IST|Sakshi
రైతు నామినీ వివరాలు నమోదు చేస్తున్న మహబూబ్‌నగర్‌ రూరల్‌ ఏఈఓ ఈహెచ్‌.టీనా

నామినీ పత్రాలు అందజేసిన రైతుల సంఖ్య ఇదీ..

ఇప్పటివరకు 1.10 లక్షల మంది వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు

ఇంకా మిగిలింది మూడు రోజులే..

సాక్షి, మహబూబ్‌నగర్‌ రూరల్‌ : సాగును ప్రోత్సహించడం.. రైతులకు వెన్నుదన్నుగా నిలవడం.. పంట పెట్టుబడితో ఆదుకోవడమే కా కుండా రైతులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినా, అకాల మరణం సంభవించినా, ఆత్మహత్య చేసుకున్నావారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబంధు సామూహిక బీమా పథకాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందనుండగా.. ఒక్కో రైతుకు రూ. 2,271 చొప్పున ఎల్‌ఐసీకి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది.

రైతుబంధు సామూహిక జీవిత బీమా చేయించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరిస్తున్నారు. గత నెల 23వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, నామినీ పత్రాల సేకరణను  ఈనెల 10వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇంకా మూడు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో మొత్తం రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.

అటు ఖరీఫ్‌.. ఇటు సమన్వయ లోపం...
రైతుబంధు సామూహిక బీమా పథకంపై వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరిçస్తున్నా.. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. రైతుబంధు పథకం కింద రైతులకు పంపిణీ చేసిన కొత్త పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లడం, చాలామందికి పాసు పుస్తకాలు అందకపోవడం తదితర సమస్యల వల్ల రైతు బీమా పథకానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. వ్యవసాయశాఖ ఏఈఓలే ఇంటింటికీ తిరగడం వల్ల పనిభారంతో రైతు బీమా పథకం జిల్లాలో అనుకున్న స్థాయిలో వేగంగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దీనికి తోడు ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌ కావడం.. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లే సరికే రైతులు పొలం పనులకు వెళ్లిపోతున్నారు. ఇక బీమా పథకానికి సంబంధించి నామినీ పత్రాలు సేకరించేందుకు ప్రభుత్వం విధించిన గడువు 10వ తేదీ మంగళవారంతో ముగియనుంది. అయితే, జిల్లాలోని మొత్తం 3,35,852 మంది రైతుల్లో 2,22,510 మందిని పథకానికి అర్హులని గుర్తించారు. ఇక ఇందులో ఇప్పటివరకు 1.44 లక్షల మంది నుంచే నామినీ పత్రాలు సేకరించగలిగారు. అంటే మిగిలిన మూడు రోజుల్లో ఇంకా 78,510 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే.  
ఏదైనా ఒక్కచోటే...
18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న వారికి బీమా సౌకర్యం కల్పించే విషయంపై సరైన ప్రచారం లేకపోవడం వల్ల కూడా బీమాపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లింది. అంతేకాక ఒకే రైతుకు రెండు, మూడు చోట్ల భూములు ఉండటం వల్ల రికార్డుల్లో విస్తీర్ణం ఎక్కువగా కనిపించడంతో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూములు ఒకచోట.. నివాసం మరోచోట ఉండటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే రైతు ఏదైనా ఒకచోట బీమా చేయించుకోవచ్చని.. అన్ని చోట్లా అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.  ఏదీఏమైనా దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు బీమా పథకంపై నిరాసక్తత కనబరుస్తున్నారు.

నామినీ పత్రాల సేకరణ వేగవంతం
జిల్లాలో రైతుల వద్ద నుంచి రైతు బీమా పథకానికి సంబంధించి నామినీ పత్రాల స్వీకరణ వేగంగా కొనసాగుతోంది. అర్హులైన రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి ఏఈఓలు పత్రాలు స్వీకరిస్తున్నారు. బీమా పత్రాల ఆన్‌లైన్‌ ప్రక్రియ సైతం చురుగ్గా సాగుతోంది. గడువు లోగా మొత్తం రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరిస్తాం.
 – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

>
మరిన్ని వార్తలు