పట్టాదార్లకే పెట్టుబడి చెక్కులు

8 Apr, 2018 08:33 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌

పంపిణీ కార్యక్రమం వీడియో చిత్రీకరణ

బేల, ఇచ్చోడలో శనగ కొనుగోలు కేంద్రాలు

కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌

ఆదిలాబాద్‌అర్బన్‌ : రైతుబంధు పథకం కింద పెట్టుబడి చెక్కులను పట్టాదారులకే అందించాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4 వేలు చొప్పున ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. రైతుబంధు పథకం కింద చెక్కులను గ్రామాల వారీగా భూములు కలిగిన పట్టాదారు రైతులకు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదని పేర్కొన్నారు. స్థానికంగా ఉండి కదలలేని స్థితిలో ఉన్న పట్టాదారుని ఇంటికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి చెక్కు అందించాలని సూచించారు. గ్రామాల వారీగా పట్టాదారుల చెక్కులను సరి చేసుకోవాలని, వాటిని భద్రంగా పోలీస్‌స్టేషన్, పోస్టాఫీసు స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఉంచాలని తెలిపారు. చెక్కుల పంపిణీకి షెడ్యూల్‌ తయారు చేయాలని, ఇంగ్లిష్‌ అక్షర క్రమంలో తయారు చేయడానికి ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.

గ్రామాల్లోని వీఆర్వో, వీఆర్‌ఏ, ఏఈవోలను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. రైతు సమన్వయ సమితుల సహకారం తీసుకోవాలని, షెడ్యూల్‌  ప్రకారం చెక్కుల పంపిణీకి ఒక రోజు ముందే గ్రామాల్లో ఠాంఠాం విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. చెక్కుల పంపిణీ తీరును వీడియో చిత్రీకరణ చేయాలని పేర్కొన్నారు. ఏ గ్రామంలో ఏప్రాంతంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ముందుగా ఆ గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను తహసీల్దార్లు ఇవ్వాలని, రైతులు, సర్వేనంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ప్రతి రైతు నుంచి రోజుకు 2 వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని రైతులకు వివరించాలని తెలిపారు. ఇచ్చోడ, బేల కొనుగోలు కేంద్రాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఆర్డీవోలు సూర్యనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, జేడీఏ ఆశాకుమారి, డీఎస్‌హెచ్‌వో నర్సింగ్‌దాస్, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ పుల్లయ్య, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.  

ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించాలి
ఆదిలాబాద్‌అర్బన్‌: వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌తన క్యాంప్‌ కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రిమ్స్‌ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలను రిమ్స్, ఉట్నూర్‌లలో ఉన్న పౌష్టికాహార కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు.

గ్రామాల్లోని పిల్లలను పోషకాహార పునరావాస కేంద్రాలకు ఎక్కువ మందిని పంపించే ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు నగదు ప్రోత్సాహకం అందించాలని పేర్కొన్నారు. ఆశలకు రూ.300 చొప్పున, అంగన్‌వాడీలకు రూ.100 చొప్పున అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్, రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్, వైద్యాధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు