రైతుబంధు షురూ

6 Oct, 2018 14:18 IST|Sakshi
తీగాపూర్‌లో చెక్కులు పంపిణీ చేస్తున్న అధికారులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: యాసంగి పంట సాగుకు పెట్టుబడిని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ‘రైతుబంధు’ రెండో విడత కింద ఎకరాకు రూ.4 వేల పంపి ణీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించింది. తొలివిడతగా కొత్తూరు మండలం తీగాపూర్‌లో ఈ పథకం కింద రైతులకు చెక్కులను అందజేసింది. పంట పెట్టుబడి కింద ఏటా ఎకరాకు రూ.8 వేల నగదును ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా రబీ సీజన్‌కు సంబంధించిన సొమ్మును పంపిణీ చేస్తోంది.

రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రైతుబంధు పథకం అమలుపై నీలినీడలు నెలకొన్నా.. కేంద్ర ఎన్నికల సంఘం పంపిణీపై ఆంక్షలు విధించకపోవడంతో రబీ సాయాన్ని అందజేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే, జిల్లా పరిధిలోని రైతులందరికీ సంబంధించిన చెక్కుల ముద్రణ ఇంకా పూర్తికాకపోవడానికి ప్రస్తుతానికి పరిమిత స్థాయిలో చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ భావించింది. అందుకనుగుణంగా తొలు త తీగాపూర్‌లో ఈ పథకానికి శ్రీకారం చుట్టినా.. దశలవారీగా మిగతా గ్రామాలకు కూడా విస్తరించనున్నారు. ఈ గ్రామ ంలోని 269 మంది రైతులకు రూ.18.71 లక్షల సాయాన్ని పంపిణీ చేశారు. 

తగ్గిన రైతుల సంఖ్య 
గత ఖరీఫ్‌లో రైతుబంధును ప్రవేశపెట్టిన సర్కారు అన్నదాతలకు చెక్కులను అందజేసింది. తొలి విడతలో భాగంగా మే నెలలో 2.87 లక్షల మందికి రైతుబంధు కింద చేయూతనివ్వాలని లక్ష్యంగా 
పెట్టుకోగా.. ఇందులో 2.42 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేసింది. ఆక్షేపణలు, వివాదాస్పద భూములకు పాస్‌ పుస్తకాలను జారీ చేయకపోవడంతో ఈ భూములకు సంబంధించిన చెక్కులను పక్కన పెట్టింది. కాగా, వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టిన వాటిలో సుమారు 15 వేల పాస్‌పుస్తకాలను కొత్తగా జారీ చేశారు. దీంతో రైతుబంధు కింద మూడు లక్షల మందికి ఈసారి సాయం అందుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. అయితే, అనూహ్యంగా ఈ సంఖ్య భారీగా తగ్గిపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలోకంటే ఈసారి తక్కువ మంది రైతులకు సాయం అందజేయాలని నిర్ణయించినట్లు సంకేతాలు అందడం విస్మయపరుస్తోంది.

జిల్లావ్యాప్తంగా 2.68 లక్షల మందికి మాత్రమే సాయం అందించనున్నట్లు తెలిసింది. ఏఏ మండలాల్లో రైతుల సంఖ్య తగ్గిందనే అంశంపై వ్యవసాయశాఖ ఆరా తీస్తోంది. ఇదిలావుండగా, ఖరీఫ్‌లో ఏడు బ్యాంకుల ద్వారా రైతులకు చెక్కులను అందజేసిన యంత్రాంగం.. ఈసారి 8 బ్యాంకుల ద్వారా రైతుబంధు సాయా న్ని తీసుకునే వెసులుబాటు కల్పించింది. కార్పొరేషన్‌ బ్యాంకు స్థానే కొత్తగా ఐడీబీఐ, టీజీవీబీ బ్యాంకులను చేర్చింది. అయితే, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఈసారి రైతులకు చెక్కుల స్థానంలో వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేయ నున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు