పగడ్బందీగా చెక్కుల పంపిణీ

27 Apr, 2018 11:04 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీదేవసేన, హాజరైన అధికారులు

మే10న ప్రారంభం

17వ తేదీన ముగింపు

కలెక్టర్‌ శ్రీదేవసేన

సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకంలో భాగంగా చెక్కుల పంపిణీ, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీపై గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ  అత్యంత పారదర్శకంగా ‘రైతుబంధు’ నిర్వహించాలన్నారు. జిల్లాలోని 208 గ్రామాల్లో 1,27,733 మంది రైతుల వద్ద ఉన్న 2,56,730 ఎకరాలకు రూ. 100కోట్లకు పైగా విలువ గల 1,28,280 చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మే 10న చెక్కుల పంపిణీ, పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి 17వ తేదీకల్లా వారంరోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ముద్రించిన పాస్‌ పుస్తకాలు అత్యంత భద్రత ప్రమాణాలతో ఉన్నాయన్నారు.

చెక్కుల పంపిణీలో రైతు సమన్వయ సమితి సభ్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి పథకం ప్రతి రైతుకి అందుతుందని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిలో విశ్వాసం పెంచాలన్నారు. పంపిణీ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించాలన్నారు. పంపిణీ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్, గ్రీవియెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలన్నారు. రైతులు తమ సందేహాలను, సమస్యలను గ్రీవియెన్స్‌ సెల్‌లో అందిస్తే రెండురోజుల్లో వారి సమస్య పరిష్కారమవుతుందన్నారు. అధికారులు వారికి వెంటనే సమాధానాలు అందించాలని, గ్రీవియెన్స్‌ సెల్‌లో విధులు నిర్వర్తించే వారికి ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు.

వేసవిని దృష్టిలో ఉంచుకొని చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని, టెంట్లు, కుర్చీలు వేయాలని, తాగునీరు, మజ్జిగ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, అధికార ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్డీవోలు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, గ్రామాల్లో చెక్కుల పంపిణీ కోసం అనువైన వేదికలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమ తేదీ, సమయం, వేదిక, తదితర అంశాలతో కూడిన కరపత్రాలు ముద్రించి రైతులకు పంపిణీ చేయాలని, ఏ గ్రామంలో చెక్కులు పంపిణీ చేసేది వారికి ముందస్తుగా తెలియజేయాలన్నారు. సుదీర్ఘ అనుభవమున్న అధికారుల సేవలు వినియోగించుకోవాలన్నారు.

300 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేసేందుకు ఒక బృందం ఏర్పాటు చేసుకున్నామని, ఆ బృందాల్లోని సభ్యులకు బాధ్యతలు అప్పగించి ఒక నమూనా తయారు చేయాలన్నారు. దాని ప్రకారం అంతా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టాదార్‌ పాస్‌ పుస్తకం నంబరు చెక్కుపై ఉంటుందని, ఆ వివరాలు, రైతుల ఆధార్‌ వివరాలు సరిచూసుకోవాలన్నారు. అధికారులు చెక్కు, పాస్‌ పుస్తకం పంపిణీ చేసేటపుడు లబ్ధిదారుని వద్ద నుంచి రెండు ప్రింటెడ్‌ రశీదులపై సంతకాలు తీసుకోవాలని, రూ. 50వేలలోపు వరకు ఒక్క చెక్కు, ఆపై పెట్టుబడి సాయానికి రెండు చెక్కులు అందిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సహాయం వదులుకునే వారి చెక్కులను రైతు సమన్వయ సమితుల అకౌంట్‌కు అందజేయాలన్నారు.

రైతుబంధు పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా బ్యాంకులకు రూ. 6వేల కోట్లు విడుదల చేసిందన్నారు. చెక్కుల అకౌంట్‌ బుక్‌ను బ్యాంకులు నిర్వహించాలన్నారు. చెక్కులపై ఉన్న పేర్లలో పొరపాట్లను పాస్‌పుస్తకం పరిశీలించి నగదు అందించాలని, లోన్, క్యాష్‌ కటింగ్‌ వంటివి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బ్యాంకర్లను హెచ్చరించారు. తహసీల్దార్లు ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని, సాదా బైనామా దరఖాస్తులు ఈనెల 28లోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ వనజాదేవి, రెతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌వో బైరం పద్మయ్య, ఆర్డీవో అశోక్‌కుమార్, డీఏవో తిరుమల్‌ప్రసాద్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బ్యాంకు ప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు