‘బంధు’.. భరోసా  

5 Jun, 2019 11:41 IST|Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రైతులకు సాగు సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా సహాయం అందిస్తోంది. గతంలో ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.8 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. మొదట చెక్కుల రూపంలో పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత నేరుగా రైతుల ఖాతాల్లో పడేలా ఏర్పాటు చేసింది. పేద, మధ్య తరగతి రైతులకు ఈ పథకం వరప్రదాయినిగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరాకు రూ.2 వేలు చొప్పున పెంచారు. అంటే ఒక్కో సీజన్‌లో ఎకరానికి రూ.5 వేలు చెల్లించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని ప్రకారం ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా రైతులకు రూ.35 కోట్ల అదనపు లబ్ధి                 చేకూరనుంది.
 
888 గ్రామాలు.. 1,19,115 మంది రైతులు..  
వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని 888 గ్రామాలకు చెందిన 1,19,115 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరందరికీ పెరిగిన సహాయం ప్రకారం రూ.186,25,15,662లను బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇందులో పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగిన అర్హులైన 359 గ్రామాలకు చెందిన 1,00,835 మంది ఉన్నారు. వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.152, 26, 98, 991 జమ చేయనున్నారు. ఇక ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద 529 గ్రామాలకు చెందిన 18,280 మంది రైతుల ఖాతాల్లో రూ.33,98,16,671 జమ చేస్తారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి మరో రూ.వెయ్యి ఆర్థిక సాయం పెంచడంతో సన్న, చిన్నకారు రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పెరిగిన రైతుబంధు సహాయంతో తమ జీవన ప్రమాణాలు కొంతమేర మెరుగు పడ తాయని ఆయా వర్గాల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 

మూడు వారాల్లో పంపిణీ 
రైతుబంధు పథకానికి ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు కూడా విడుదలయ్యాయి. జిల్లాలోని అన్ని గ్రామాల రైతులకు మూడు వారాల్లో రైతుబంధు సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.  – కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి

మరిన్ని వార్తలు