రబీలోనూ రైతులందరికీ పెట్టుబడి! 

3 May, 2018 01:38 IST|Sakshi
రైతు

సాక్షి, హైదరాబాద్‌ : రబీ సీజన్‌లోనూ రైతులందరికీ పెట్టుబడి సొమ్ము అందజేయాలని సర్కారు భావిస్తోంది. ఖరీఫ్‌లో రైతు బంధు పథకం కింద ఎంతమందికి పెట్టుబడి సొమ్ము ఇస్తారో వారందరికీ రబీలోనూ అందజేయాలని యోచిస్తోంది. ఈ లెక్కన రబీలో రైతులు సాగు చేసినా, చేయకపోయినా ఆర్థిక సాయం అందనుంది. ఖరీఫ్‌లో పట్టాదారు పాసుపుస్తకం ఉన్న 58 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సొమ్మును అందజేయనున్నారు. అయితే రబీలో మాత్రం కేవలం పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం గతంలో నిర్ణయించింది.

పంటలు సాగు చేసిన రైతుల లెక్కలు తేల్చి.. వారికి మాత్రమే పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని భావించారు. అయితే తాజాగా ఆ నిర్ణయానికి సవరణ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెండ్రోజుల క్రితం మాట్లాడుతూ.. ‘రబీలోనూ రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం’అని చెప్పారు. వాస్తవానికి ఖరీఫ్‌ కంటే రబీలో పంటల సాగు మూడో వంతుకే పరిమితం అవుతుంది. ప్రస్తుతం ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. రబీ విస్తీర్ణం 31.92 లక్షల ఎకరాలే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రబీ నాటికి నీరందితే 8 లక్షల ఎకరాలు అదనంగా సాగు కానుందని అంటున్నారు. 

రూ.12 వేల కోట్ల బడ్జెట్‌ ఉందిగా.. 
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఖరీఫ్‌లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించి, రబీలో కొందరికే ఇస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పైగా రబీలో ఎవరు సాగు చేశారు, ఎవరు చేయలేదన్నది తేల్చడం కష్టమైన వ్యవహారం. ఖరీఫ్‌లో విజయవంతంగా అమలు చేసి, రబీలో వివాదంగా మారితే అది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన సర్కారులో ఉంది. ఎలాగూ బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించినందున రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తే వ్యతిరేకత రాకుండా చూసుకోవచ్చన్నది ప్రభుత్వ భావనగా చెబుతున్నారు. రబీలోనూ అందరికీ పెట్టుబడి సొమ్ము ఇచ్చే అంశంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు