పెట్టుబడి జమ

23 Oct, 2018 08:00 IST|Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: రైతుబంధు పథకానికి సంబంధించిన నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో చెక్కుల రూపంలో ఇవ్వకుండా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా సోమవారం జిల్లాలోని 1,365 మంది రైతుల ఖాతాల్లో రూ.2.30 కోట్లు జమ చేశారు. అకౌంట్లలో నగదును జమ చేయడం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను ఏఈఓలు రైతుల వద్దకు వెళ్లి సేకరించారు. సోమవారం రైతు ఖాతాల్లో నగదు జమ కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడతల వారీగా హైదరాబాద్‌లోని ట్రెజరీ కార్యాల యం నుంచి నగదు జమ కానుంది. చాలామంది రైతులు తమ బ్యాంక్‌ ఖాతాలను ఏఈఓలకు ఇవ్వకపోవడంతో జాప్యం జరిగే అవకాశం లేకపోలేదు.

నేరుగా ఖాతాల్లోకి..
రైతుబంధు పథకం రెండో విడత పెట్టుబడి నేరుగా రైతు ఖాతాల్లో సోమవారం నుంచి వ్యవసాయ శాఖ జమ చేసింది. మొదటిరోజు జిల్లాలోని 5,458 ఎకరాలకు సంబంధించి 1,365 మంది రైతులకు గాను రూ.2.30 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం లక్షా 32వేల మంది రైతులు ఉన్నారు. రబీ పంటకు సంబంధించి మొత్తం రూ.2 కోట్ల 10లక్షలు జమ కావాల్సి ఉండగా, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌కు సంబంధించి ఇంకా డబ్బులు జమ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.

ఇందులో 1,14,228 మంది రైతులకు గాను రూ.178.76 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఆయా మండలాల ఏఈఓలు 45,307 మంది రైతుల ఖాతాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు(ఏఓ) వాటిని పరిశీలించి 19,449 నిర్ధారణ చేసి నగదు జమ కోసం ఖాతాలను పంపించారు. మొదటిరోజు తొమ్మిది మండలాలు ఆదిలాబాద్‌రూరల్, బజార్‌హత్నూర్, బోథ్, గాదిగూడ, గుడిహత్నూర్, జైనథ్, మావల, తలమడుగు, ఉట్నూర్‌లకు సంబంధించిన 42 గ్రామాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.

నేడు 18 మండలాల రైతులకు..
మొదటి రోజు ప్రయోగాత్మకంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మంగళవారం జిల్లాలోని 18 మండలాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 30,873 ఎకరాలకు సంబంధించిన 7523 మంది రైతులకు గాను రూ.12కోట్ల 34 లక్షలు రబీ పంట సాయం ఖాతాల్లో జమ కానుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 20 శాతం మాత్రమే రైతుల ఖాతాలను నగదు జమ కోసం హైదరాబాద్‌కు పంపించారు. మిగతా 80 శాతం ఖాతాలను ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఖాతాలు ఇవ్వని రైతులు ఉంటే సంబంధిత మండల ఏఈఓకు అందిస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. 

నగదు జమ చేస్తున్నాం..
రైతుబంధు రెండో విడత పెట్టుబడి సాయం కింద సోమవారం 1,365 మంది రైతుల ఖాతాల్లో రూ.2కోట్ల 30లక్షలు ప్రయోగాత్మకంగా జమ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మంగళవారం జిల్లాలోని 18 మండలాలకు చెందిన 7523 మంది రైతుల ఖాతాల్లో రూ.12కోట్ల 34 లక్షలు జమ చేయనున్నాం. ఇప్పటివరకు 45,307 ఖాతాలను ఆన్‌లైన్‌ చేయడం జరిగింది. నగదు జమ కోసం 19,449 ఖాతాలను పంపించాం. ఇంకా ఖాతాల వివరాలను అందించని రైతులు మండల ఏఈఓలకు అందించాలి. – ఆశ కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు