పెట్టుబడి సాయం.. రైతు ఖాతాల్లోకి

23 Oct, 2018 10:23 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: వచ్చే రబీ పంటకు ప్రభుత్వం రైతుబంధు పథకం కింద  అందించే పెట్టుబడి సాయం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతుబం«ధు సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా  బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిAన విషయం తెలిసిందే.  దీంతో ఈ నెల 10వ తేదీ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల బ్యాంక్‌ ఖాతా నంబర్లను సేకరిస్తున్నారు.

జిల్లాలో 1,48,581 మంది పట్టాదారులకు రూ118,99,94,630 రైతు బంధు సాయం అందనుంది. ఖరీఫ్‌ సీజన్‌లో ఇచ్చిన విధంగానే రైతులకు చెక్కులను ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే చెక్కుల పంపిణీ ఓటర్లను ప్రభావితం చేస్తుందనే ఉద్దేశంతో నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని ఈసీ ఆదేశించింది. రైతుల ఖాతా నంబర్లు సేకరించిన అధికారులు అందులోనే డబ్బులు జమచేస్తున్నారు. ఈ నెల చివరికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. 

ఖరీఫ్‌లో అందుకున్న వారికే.. 
ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న రైతులకే రబీ సాయం అందించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లాలో ఖరీఫ్‌కు 1,69,731 మంది పట్టాదారులు ఉండగా రూ130,02,09,000 విలువ చేసే 1,70,292 చెక్కులు వచ్చాయి. అందులో రూ.119,79,62,250 విలువ చేసే 1,50,224 చెక్కులు రైతులు అందుకున్నారు. రూ.10,09,98,410 విలువ చేసే 20,068 చెక్కులు రైతులు తీసుకోలేదు. మొదటి విడతలో చెక్కులు అందుకున్న వారికే రబీలో సాయం అందించాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న వారిలో కొందరు రైతులు మరణించారు. తొలి రోజు 3,771 మందికి  సోమవారం తొలి విడతలో 3,771 మందికి రూ 3,19,80,220 రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయ్యాయి. రెండో విడతలో 19,258 మందికి రూ.16,67,01,920లు బ్యాంక్‌ ఖాతాల్లో మరో రెండు రోజుల్లో జమ కానున్నాయి. మొత్తం రెండు విడతల్లో 20,329 మందికి రూ.19,86,82,140 జమకానున్నాయి. ఇంకా 1,28,252 మందికి వివిధ విడతల్లో రూ 99,13,12,490 జమ చేయనున్నారు. తొలి విడతలో నెక్కొండ రైతులకు రైతు బంధుసాయం బ్యాంకుల్లో జమ కాలేదు.

అధికారులకు సవాల్‌గా మారిన సేకరణ
రైతుల నుంచి బ్యాంక్‌ అకౌంట్ల నంబర్ల సేకరణ అధికారులకు సవాల్‌గా మారిం ది. వ్యవసాయశాఖ అందించిన ప్రొఫార్మా ప్రకారం సేకరించాలని ఆదేశించారు. అన్ని వివరాల సేకరణలో అధికారులు తలమునకనవుతున్నారు. రైతుల నుంచి ఇంకా దాదపు 60 శాతం అకౌంట్‌ నంబర్లు సేకరించాల్సి ఉన్నట్లు తెలిసింది.
 
విడతల వారీగా బ్యాంకుల్లో జమ
ఈ నెల 10వ తేదీ నుంచి రైతు బంధు మంజూరైన వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరిస్తున్నాం. ఖరీఫ్‌లో చెక్కులు తీసుకున్న వారే రబీ సాయంకు అర్హులు. మొదటి విడతకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో రెండు రోజుల్లో రెండో విడతకు సంబంధించిన డబ్బులు సైతం జమ చేస్తాం. గ్రామాల్లో వచ్చే వ్యవసాయ అధికారులకు రైతులు బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లు ఇచ్చి సహకరించాలి. –ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి

మరిన్ని వార్తలు