ఖరీఫ్‌ ‘పెట్టుబడి’ 

10 Jun, 2019 09:26 IST|Sakshi

నల్లగొండ అగ్రికల్చర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం నగదు రైతుల ఖాతాల్లో జమవుతోంది. ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడి కోసం ఉపయోగపడే విధంగా ఈ నెల మొదటి వారంనుంచి రైతుల ఖాతాల్లో నగదును జమచేయడాన్ని వ్యవసాయశాఖ ప్రారంభించింది. మృగశిర కార్తె ప్రారంభం కావడం జిల్లాలో రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు ప్రారంభించారు.

సీజన్‌ మొదట్లోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమచేయడంతో.. రైతులకు సకాలంలో పెట్టుబడి కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 4,14,272 మంది రైతులకు గాను రూ.579,96,32,660లను రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమచేయాల్సి ఉంది. అయితే ట్రెజరీ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలోని 19,795 మంది రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.17,73,81,865 బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగిలిన రైతులకు వరుస క్రమంలో ఖాతాల్లో జమకానున్నాయి. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఏఈఓలకు ఖాతా నంబర్లు అందజేయాలి..
పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో దొర్లిన తప్పొప్పులు సవరణలు చేసిన తరువాత తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకంతో కూడిన పాస్‌బుక్కలు వచ్చిన వారు జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వారికి గత ఖరీఫ్, రబీలో రైతుబంధు నగదు ఖాతాల్లో జమకాలేదు. వారందరి నుంచి పాస్‌పుస్తకాల జిరాక్స్‌లను, రైతు ఖాతా నెంబర్లను సేకరించాలని వ్యవసాయ శాఖను అదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల నుంచి పాస్‌పుస్తకాల జిరాక్స్‌లు, ఖాతా నంబర్లను సేకరించే పనిలో ఉన్నారు. రైతులందరూ విధిగా వ్యవపాయ విస్తరణాధికారులకు జిరాక్స్‌లను అందజేయాలని కోరుతున్నారు.

భూములు కొనుగోలు చేసిన వారు..
ఇతరుల నుంచి భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని తహసీల్దార్‌ నుంచి పాస్‌ పుస్తకం తీసుకున్న వారు కూడా రెవన్యూ శాఖ.. తమ పేరు వ్యవసాయ శాఖకు పంపిన జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ జాబితా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించాల్సి ఉంది. వారి పేరు జాబితాలో ఉంటే వారు కూడా పాస్‌పుస్తకం, ఖాతా నెంబర్‌ జిరాక్స్‌లను అందజేస్తే ఖరీఫ్‌లో రైతుబంధు నగదు జమచేసే అవకాశం ఉంటుంది.

దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ..
ఖరీఫ్‌లో రైతుబంధు పంపిణీ ఇప్పటికే ప్రారంభమై సుమారు రూ.17 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. రైతులందరికీ తప్పకుండా దశల వారీగా ఖాతాల్లో జమచేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రైతులు దుక్కులు దున్నకం, విత్తనాల కొనుగోలును ప్రారంభించారు. రైతుబంధు పథకం పెట్టుబడికి ఎంతో ఉపయోగపడనుంది. రైతులు అవకాశాన్ని సద్వినియోగ చేసుకుని సకాలంలో పంటల సాగును చేపట్టాలి. – జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ

మరిన్ని వార్తలు