అర్హులందరికీ రైతుబంధు అందాలి

12 Jun, 2019 14:34 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌జోన్‌: జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అప్‌లోడ్‌ కాని రైతుల ఖాతాల వివరాలను వెంటనే అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెండిం గ్‌లో ఉన్న ప్రతిరైతు వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి రైతుకు రైతుబంధు చేరాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏరైతూ నష్టపోకుండా చూడాలన్నారు. ప్రతిఅధికారి అప్రమత్తంగా ఉండి రైతుబంధును విజయవంతం చే యాలన్నారు. ప్రతిఐదువేల ఎకరాలకో ఏఈ వోను ప్రభుత్వం నియమించిందని, వారు ప్రతి రోజు రైతులకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలి పారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అదికా రులు రైతులను కూరగాయల సాగు వైపునకు మళ్లించాలని కలెక్టర్‌ సూచించారు.

జిల్లాకు హైదరాబాద్‌ నుంచి కూరగాయల దిగుమతి అవుతోందని, మన జిల్లాకు డిమాండ్‌ మేర కూరగాయలను మన జిల్లాలోనే  సాగయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం అవసరమయ్యే మార్కెట్‌ సౌకర్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలను పం డించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నిగ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో సీతాఫల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల రైతులకు వాటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.  ప్రతిఇంటికి మునగ, బొప్పాయి మొక్కలను అందించాలన్నారు. ఈ సారి హరితహారంలో ప్రజలకు ఇష్టమైన మొక్కలనే పంపిణీ చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పంచయతీ కార్యదర్శులు ఊరూరా సర్వే చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారి పరశురాం, ఉద్యానవనశాఖ అధికారి నర్సయ్య, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్‌తో పాటు ఏడీఏలు, ఏవోలు, ఉద్యానవనశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు