రైతుకు భరోసా

19 Jun, 2019 07:55 IST|Sakshi
‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు పాల్గొన్న ఆర్డీఓ, తహసీల్దార్లు

నారాయణపేట: ‘భూ ప్రక్షాళనలో చిన్న చిన్న తప్పులతో కొంతమందికి మాత్రమే కొత్త పాసు పుస్తకాలు రాలేదు.. ఇందుకు ఎవరూ పరేషాన్‌ కావొద్దు.. రెవెన్యూ రికార్డుల్లో భూములు మీవైతే.. మీకు తప్పకుండా కొత్త పాసుపుస్తకాలు వస్తాయ్‌.. రైతు బంధు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయి.. ఇందులో ఎలాంటి అపోహలు పెంచుకోవద్దు..’ అని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. భూ సమస్యలు, రైతుబంధు తదితర సమస్యలపై ప్రజలు తమ గోడును వినిపించేందుకు కలెక్టర్‌తో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పలువురు రైతులు ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ ద్వారా భూ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు చెప్పిన  సమస్యలను కలెక్టర్‌ ఓపికగా విని.. పరిష్కారానికి భరోసా ఇచ్చారు.

సమస్యల ఏకరువు.. 
చాలామంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం రావడం లేదని.. కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. పట్టాదారు పాస్‌ పుస్తకాలకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్‌కు ఫోన్‌లో ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్‌ ఫోన్‌ చేసిన రైతులందరి సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. సమస్య పరిష్కారం తర్వాత వారికి తిరిగి   ఫోన్‌ చేసి చెప్పాలని తహసీల్దార్లను ఆదేశించారు. కొంతమంది రైతుల ఫోన్‌ నంబర్లను నోట్‌ చేసుకొని సంబంధిత వీఆర్‌ఓలకు సమాచారం అందించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మరి కొంతమంది రైతులకు మాత్రం ఈ రోజు (మంగళవారం) సాయం త్రం వరకు మీమీ మండల తహసీల్దార్ల వద్దకు వెళ్లి సమస్యను వివరించాలని చెప్పారు. ఫోన్‌ ఇన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆర్డీఓ నోట్‌ చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ రఘువీరారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్‌ ఏఓ బాలాజీ, నారాయణపేట తహసీల్దార్‌ రాజు, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు.

సార్‌ నీ కాల్మొక్త.. పాసు బుక్‌ ఇస్తలేరు 

కలెక్టర్‌ సార్‌ నీ కాల్మొక్త.. నా పేరు హన్మంతు. దామరగిద్ద మండలం ఆశన్‌పల్లి గ్రామం. 1996లో సర్వే నంబర్లు 91, 92, 94లలో ఐదెకరాల భూమి కొన్నాం. డాక్యుమెంట్లు, ఈసీ ఉన్నాయి. ఉర్దూలో ఉన్న డాక్యుమెంట్లను తెలుగులోకి మార్పించా. సంబంధిత పత్రాలను రెవెన్యూ అధికారులకు చూపించినా పాస్‌ పుస్తకాలు ఇవ్వడం లేదు. నాకు న్యాయం చేయండి సారూ.

     కలెక్టర్‌ స్పందిస్తూ.. హన్మంతు మీ డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఈ రోజు సాయంత్రం దామరగిద్ద తహసీల్దార్‌ను కలవండి. వాటిని సరిచూసి విచారణ జరిపి మీకు న్యాయం జరిగిలే చూస్తాం. సరే సార్‌ మీకు రుణపడి ఉంటా.

నా భూమి నాకు ఇప్పించండి 

సార్‌.. నా పేరు కుర్వ దశరథ్‌. ఊట్కూర్‌ మండలం పెద్దపొర్ల గ్రామం. సర్వే నంబర్‌ 170/సీ/5లో 18 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో మార్చి నాకు భూమి లేకుండా చేశారు. నా వద్ద పట్టా పాసు బుక్కు ఉంది. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయండి సార్‌.

కలెక్టర్‌ స్పందిస్తూ.. అక్కడే ఉన్న ఊట్కూర్‌ తహసీల్దార్‌ను విచారణ జరిపి భూమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. భూమి దశరథ్‌దే అని తేలితే సంబంధిత వీఆర్‌ఓపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. పట్టా చేసుకున్న వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని హెచ్చరించారమూడెకరాలకు ఎకరానే వచ్చింది 

సార్‌ మా మామయ్య హన్మంతు పేరిట సర్వే నంబర్లు 692, 704లో మూడెకరాల భూమి ఉంది. కొత్త పుస్తకంలో ఒక ఎకరా మాత్రమే వచ్చింది. నా పేరు పవిత్ర. మాది మరికల్‌ గ్రామం. ఇంకా రెండు ఎకరాల భూమి ఎక్కడపోయింది. మాకు న్యాయం చేయండి.   కలెక్టర్‌ స్పందిస్తూ.. మరికల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ ఖలీద్‌ ను కలిసి భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు చూయించండి. రికార్డులను పరిశీలించి సరిచేసుకునే అవకాశం ఉంది.

కొత్త పాసుపుస్తకం రాలేదు 

  • సార్‌.. నా పేరు నీరటి వెంకటమ్మ. మాది నారాయణపేట పట్టణం పళ్లబురుజు. సర్వే నంబర్లు 441, 443లో తొమ్మిది ఎకరాలకు 10 సెంట్లు తక్కువగా ఉంది. మొదటి విడతలో పాసుపుస్తకం రాకపోయినా రైతుబంధు డబ్బులు ఇచ్చారు. ఇంత వరకు కొత్త పాసుపుస్తకం రాలేదు. రెండో విడత డబ్బులు పడలేదు. దయచేసి నాకు కొత్త పాసు పుస్తకం ఇప్పించి రైతుబంధు డబ్బులు వేయించండి సార్‌ మీకు పుణ్యమొస్తది. 
  •      తక్షణమే కలెక్టర్‌ స్పందించి ఫోన్‌ ఇన్‌ నీరటి వెంకటమ్మను లైన్‌లోనే పెట్టి వెంటనే వీఆర్‌ఓ కు ఫోన్‌ కలపండంటూ పక్కనే ఉన్న నారాయణపేట తహసీల్దార్‌కు ఆదేశించారు. వీఆర్‌ఓ తో ఫోన్‌లో మాట్లాడుతూ నీరటి వెంకటమ్మకు సంబంధించిన భూమిపై నివేదిక సాయంత్రం వరకు నా టేబుల్‌పై ఉండాలని ఆదేశించారు. 
  • ఇనాం భూములకు.. 
  • సార్‌.. నాపేరు గజలప్ప. దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామం. సర్వే నంబర్లు 9, 10, 11, 16లలో దాదాపు 20 కుటుంబాలకు ఇనాం భూ ములు ఇచ్చారు. కొత్త పాసు పుస్తకాలు ఇవ్వ మంటే ఇవ్వడం లేదు. తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
  • కలెక్టర్‌ స్పందిస్తూ.. బాపన్‌పల్లిలో ఈనాం భూములకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టి నివేదికలను సమర్పించాలని ఆర్డీఓ శ్రీనివాసులు సూచించారు. బాపన్‌పల్లితోపాటు ఇతర గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉంటే తహసీల్దార్లతో సమీక్షించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.
  • బుక్క రాలే.. పైసలు పడలే 
  • సార్‌.. నా పేరు నర్సింహులు. దామరగిద్ద మండలం లక్ష్మీపూర్‌. ఇంత వరకు కొత్త పాసు పుస్తకం రాలేదు. రైతుబంధు డబ్బులు పడలేదు. ఆరు నెలలుగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అప్పుడు.. ఇప్పుడు అంటూ తిప్పుతున్నారు. కానీ, ఇంత వరకు బుక్‌ ఇస్తలేరు. నాకు న్యాయం చేయండి సార్‌.
  •      కలెక్టర్‌ స్పందిస్తూ..ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దామరగిద్ద తహసీల్దార్‌ను వెళ్లి కలవండి. మీ దగ్గర ఉన్న పాత పాసు బుక్కులు చూయించండి. ఏమైనా సమస్య ఉంటే వాటి ని సరిచేసి కొత్తపాసు బుక్కు ఇచ్చేందుకు చర్యలు చేపడుతాం.

 
నా కొడుకు జర్మనీలో ఉంటాడు 
సార్‌.. నా పేరు రఘుపతిరెడ్డి. మద్దూరు మండలం నిడ్జింత. నా కొడుకు జర్మనీలో ఉంటాడు. భూమి కొడుకు పేరు మీద ఉంది. కొత్త పట్టా పాసు పుస్తకం రాలేదు. ఆఫీసులో అడిగితే ఈకేవైసీ సమస్య ఉందంటున్నారు. మాకు పట్టా పాసుపుస్తకం ఇప్పించండి. 
     కలెక్టర్‌ స్పందిస్తూ.. మీ కుమారుడి ఆధార్‌ కార్డును ఈకేవైసీ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయించాలి. మీరు తహసీల్దార్‌ కార్యాలయంలో వెళ్లి కలవండి. మీ కుమారుడి ఆధార్‌ నంబర్‌కు లింకైన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబ ర్‌ చెబితే లింకప్‌ చేసి ఓకే చేస్తారు. అప్పుడు మీ కొడుకు పేరిట కొత్త పాసుపుస్తకం వస్తుంది. 

తహసీల్దార్‌ను కలిసిన రైతులు 
తమకు పొలాలు ఉన్న కొత్త పట్టా పాసు పుస్తకాలు రాలేదని ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చిన సిద్దన్‌ కిష్టమ్మ, నీటి వెంకటమ్మల కుటుంబ సభ్యులు కలెక్టర్‌ సూచన మేరకు సాయంత్రం 4 గంటలకు తహసీల్దార్‌ రాజు ను కలిసి భూముల పట్టా పాసు పుస్తకాల జిరాక్స్‌ కాపీలను అందజేశారు. కలెక్టర్‌కు ఫోన్‌ ఇన్‌లో తమ సమస్యను వివరించామని, మిమ్మల్ని కలవాలని చెప్పారని వివరించారు. దీంతో తహసీల్దార్‌ స్పందిస్తూ.. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు