ఖాతాల్లోకే ‘రైతుబంధు’ 

12 Oct, 2018 10:50 IST|Sakshi

బూర్గంపాడు : రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందజేతకు ఎన్నికల సంఘం షరతులు విధించింది. పెట్టుబడి సాయాన్ని నేరుగా చెక్కుల రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. రెండో విడత రైతుబంధు చెక్కుల పంపిణీకి శాఖాపరంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న వ్యవసాయశాఖ ఎన్నికల సంఘం ఆదేశాలతో డైలమాలో పడింది. ఎన్నికల సంఘం ఆదేశానుసారం రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు ప్రారంభించింది. రైతుల బ్యాంకు ఖాతాల వివరాల సేకరణకు ముమ్మర చర్యలు ప్రారంభించింది.

గ్రామాల్లో ఏఈఓలు రైతుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి రైతుబంధు చెక్కులను ఈ నెల 7వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో చెక్కుల పంపిణీకి స్వస్తి చెప్పి బ్యాంకు ఖాతాలలో జమచేసే చర్యలు ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయం అందేందుకు మరో ఇరవైరోజులకు పైగా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వివరాల సేకరణలో అధికారులు 
రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించేందుకు బుధవారం నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు  రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్మును జమచేయాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. బ్యాంకు ఖాతాలు లేనటువంటి రైతులకు వెంటనే  ఖాతాలు తెరిపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూశాఖ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలను కూడా సేకరించారు. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పుడు రెవెన్యూశాఖ వద్ద ఉన్నటువంటి రైతుల బ్యాంకుఖాతాల సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారు. దీంతో ఖాతాల సేకరణ సులువవుతుందని భావిస్తున్నారు.  

తొలివిడతలో సాయం పొందినవారికే..  
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు  రైతుబం«ధు పథకంలో తొలివిడతలో చెక్కులు తీసుకున్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. కొత్తగా పట్టాహక్కులు కలిగిన రైతులకు పెట్టుబడిసాయానికి గండిపడింది.  ఏఈఓలు రైతుల బ్యాంకు ఖాతాల సేకరణకు సంబంధించి ఓ ఫార్మట్‌ను వ్యవసాయశాఖ తయారుచేసింది. ఇందులో రైతుపేరు, గ్రామం, మండలం, జిల్లా,  ఆధార్‌ నంబర్, పట్టాదారు పాసుపుస్తకం నంబర్, సెల్‌నెంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఖాతా నంబర్‌ వివరాలు నమోద చేసి  రైతుసంతకం, ఏఈఓలు సంతకాలు చేయాల్సివుంది. ఈ నివేదికలను వ్యవసాయశాఖ కమిషనర్‌కు కార్యాలయానికి అన్‌లైన్‌లో పంపాలి.  ఆ తరువాత ఈ– కుబేర్‌  ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు జమచేయనున్నారు. జిల్లా ఖరీఫ్‌లో 1.21 లక్షల మంది రైతులకు  1. 31 లక్షల చెక్కులను పెట్టుబడి సాయంగా అందించారు. ఖరీఫ్‌లో జిల్లాలో రైతులకు రూ. 120 కోట్ల పెట్టుబడి సాయం అందింది. రబీలో కూడా అంతే మొత్తంలో అందనుంది.  

గతంలో లబ్ధిపొందిన వారికే.. 
ఖరీఫ్‌లో రైతుబంధు పథకంలో లబ్ధిపొందిన రైతులకే రబీలో పెట్టుబడి సాయం అందుతుంది. గతంలో మాదిరి చెక్కులు కాకుండా ఈ సారి రైతుల బ్యాంకు ఖాతాలలో పెట్టుబడి సాయం జమవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాల సేకరణ ప్రక్రియ అన్ని మండలాల్లో చేపట్టాం. రైతులు వ్యవసాయశాఖ అధికారులకు సహకరించి బ్యాంకు ఖాతాల వివరాలను అందజేయాలి. 
–కే అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి    

మరిన్ని వార్తలు