కొందరికే ‘బంధు’వు 

27 Dec, 2018 07:06 IST|Sakshi

అర్హులందరికీ అందని ‘రైతు బంధు’ నగదు పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురుచూపులు 

బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వైనం 

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధు పథకం కింద నగదు జమ చేసే ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. రబీ సీజన్‌కు సంబంధించి అక్టోబర్‌ మాసంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. అయితే, మూడు నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు నగదు అందలేదు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 80శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు తెలుస్తున్నా.. వాస్తవానికి ఆ మేరకు కూడా ఖాతాల్లో డబ్బు జమ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని, ఎప్పుడు అవుతుందని అధికారులను అడగడం కనిపిస్తోంది.  అధికారులు ఖాతాల్లో డబ్బు జమ విషయమై ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇస్తే ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండదు.

చెక్కులకు బదులు నగదు 
రైతులు పంట పెట్టుబడి కోసం దళారులు, వ్యా పారుల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్ర భుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఖరీఫ్‌ సీజన్‌లో పెట్టుబడి కింద ఎకరానికి రూ. 4 వేలు అందించారు. ఆ సమయంలో రైతులకు చె క్కులు అందించగా రైతుల్లో ఖాతాల్లో జమ చేసు కుని డబ్బు తీసుకున్నారు. ఇక రబీ సీజన్‌కు సం బంధించి పెట్టుబడులను చెక్కుల రూపంలో పం పిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా శాసనసభ ఎన్నికల కోడ్‌ కారణంగా బ్రేక్‌ పడింది. ఈ మేరకు రైతులకు చెక్కుల రూపంలో ఇవ్వకుండా వారి ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. దీంతో రైతుల ఖాతాల వివరాలు సేకరించిన అధికారులు ఆయా ఖాతాల్లో నగదు జమ చేయడం ఆరంభించారు.

ఈ ప్రక్రియ అక్టోబర్‌లో ప్రారంభం కాగా.. మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. ఇప్పటి వరకు 80 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, మిగతా 20 శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో డబ్బు అందని రైతులు అసలు డబ్బు వస్తుందా, రాదా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వ్యవసాయ అధికారులను అడుగుతుండగా.. రేపు, మాపు అంటూ రకరకాలు కారణాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా రబీ పెట్టుబడి, ఇతర ఖర్చులకు అండగా ఉంటుందనుకుంటున్న డబ్బు అందక వారు ఇబ్బంది పడుతున్నారు.
 
ఖాతాల వివరాలు లేక... 
జిల్లాలో రైతుబంధు పథకానికి సంబంధించిన అర్హులైన రైతులు 2,77,790 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి రూ.316.86 కోట్ల నగదు జమ కావాల్సి ఉంది. వ్యవసాయశాఖ ఏఈఓలు ఇప్పటి వరకు 2,50,017 మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఈ అకౌంట్లలో రైతుబంధు నగదు జమ చేసేందుకు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌ కార్యాలయానికి నివేదించారు. ఈ మేరకు కమిషనరేట్‌ అధికారులు 2,45,500 ఖాతాల్లో డబ్బు చేసేలా ట్రెజరీకి పంపించారు.

అలా ఇప్పటి వరకు 2,34,300 మంది రైతులకు సంబంధించి రూ.276.34 కోట్లు ఖాతాల్లో జమ అయింది. అంటే 80 శాతం మంది రైతులకు రైతు బంధు నగదు అందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా యి. ఇంకా 15,717 మంది రైతుల ఖాతాల్లో డ బ్బు జమ కావాల్సి ఉంది. వీరితో పాటు ఖాతా నంబర్లు పంపింనా వివరాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో దాదాపు 1,800 ఖాతాలకు సంబం«ధించిన నగదు సుమారు రూ.45 లక్షలు తిరిగి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఆ రైతుల ఖాతాల వివరాలను మరోసారి సేకరించి పంపించనున్నట్లు తెలిపారు.
 
బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు 
రబీ పంటకు సంబంధించి రైతుబంధు నగదు అకౌంట్లలో జమ కావడంలో జాపం జరుగుతుంది. ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదు. బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేని వారితో పాటు అసలే ఖాతాల నంబర్లు ఇవ్వని వారి వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. రబీ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, రసాయన ఎరువులు కొనుగోలు చేయాల్సిన తరుణంలో చేతుల్లో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

గత ఖరీఫ్‌లోపెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేయగా.. సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ కారణంగా ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు సంబం«ధించిన బ్యాంకు ఖాతాలు, ఆధార్, పట్టాదారు పాసు పుస్తకం వివరాలను సేకరించి కమిషనర్‌కు పంపించారు. ఆయా రైతుల ఖాతాల్లో దశల వారీగా రైతు బంధు డబ్బును జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుండడంతో ఎప్పుడు డబ్బు జమ అవుతుందో తెలియక రైతులు ప్రతిరోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. 

ఇప్పటి వరకు  రూ.276.34 కోట్లు జమ 
జిల్లాలోని 2,34,300 మంది రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు రూ. 276.34 కోట్లు పెట్టుబడి సాయం జమ చేశాం. ఇంకా 27,773 మంది రైతులు తమ అకౌంట్‌ నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఆయా రైతులు కూడా త్వరగా తమ పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు అకౌంట్‌ బుక్, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలను ఏఈఓలను అందజేయాలి. అలా ఇచ్చిన వారి ఖాతాల్లో 15–20 రోజుల్లో రైతు బంధు నగదు జమ చేస్తాం.  – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

మరిన్ని వార్తలు