రైతుబీమా బాండ్లు రెడీ

6 Aug, 2018 12:17 IST|Sakshi

కరీంనగర్‌రూరల్‌: రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబీమా పధకం లబ్ధిదారుల పాలసీపత్రాలు వ్యవసాయశాఖకు చేరాయి. సోమవారం నుంచి ఈనెల 13వరకు అర్హులైన రైతులకు గ్రామాల వారీగా బీమా పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌ గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో రాష్ట్ర ఆర్ధిక,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ రైతులకు బీమా బాండ్లను పంపిణీ చేసి రైతుబీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రైతులు ఏ  కారణంతో మృతి చెందినప్పటికీ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయాన్ని అందించనుంది. దీనికోసం రైతులు ఎలాంటి బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రభుత్వమే ఉచితంగా బీమా సౌకర్యం కల్పించనుంది. రైతుబీమా పథకంలో అర్హులైన రైతులను గుర్తించేందుకు వ్యవసాయశాఖ ఆద్వర్యంలో జూన్‌ 8నుంచి గ్రామాల వారీగా అధికారులు నామీనీపత్రాలు, రైతుల ఆధార్‌కార్డులు సేకరించారు. ప్రభుత్వం గత నెల 25వరకు రైతుబీమా పధకంలో రైతుల పేర్లు నమోదుకోసం  చివరి గడువుగా నిర్ణయించింది.

మొదటి విడతలో60,380 బీమాబాండ్లు
జిల్లాలో మొత్తం రైతులు 130643ఉండగా రైతుబీమాలో 114823మంది రైతుల నుంచి వ్యవసాయాధికారులు దరఖాస్తులను స్వీకరించి ఎల్‌ఐసీకి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మొదటి విడతగా 60,380 మంది రైతులకు బీమాబాండ్లను ఎల్‌ఐసీ వ్యవసాయశాఖకు పంపించగా.. ఇంకా 70,263బాండ్లు రావాల్సి ఉంది. ఈనెల 6నుంచి 13వరకు అన్ని గ్రామాల్లో బీమాబాండ్లను రైతులకు పంపిణీ చేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 16 మండలాలనుంచి మొత్తం 114823 దరఖాస్తులను పరిశీలించగా 60380 బీమాబాండ్లు వ్యవసాయశాఖకు ఎల్‌ఐసీ పంపించింది.

మరిన్ని వార్తలు