‘రైతు బీమా’ ప్రారంభం

15 Aug, 2018 02:47 IST|Sakshi

13వ తేదీ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన పథకం

తొలి బీమా లబ్ధిదారులు నలుగురు

బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం

వ్యవసాయ శాఖకు ఎల్‌ఐసీ మాస్టర్‌ పాలసీ..

నేడు సీఎం సమక్షంలో బాండ్‌ అందజేత

సాక్షి, హైదరాబాద్‌: రైతు బీమా పథకం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో 13వ తేదీ అర్ధరాత్రి నుంచి నలుగురు రైతులు మరణించినట్లు గుర్తించిన అధికారులు.. ఆయా కుటుంబాల నామినీలకు రూ. 5 లక్షల పరిహారపు సొమ్ము అందించనున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు జి.బాలకొండయ్య, సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన జె.పోచయ్య, అదే జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన రాచర్ల బూదవ్వ, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పూడూరు గ్రామానికి చెందిన బీసన్న చనిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది.

ఈ నలుగురిలో ఒకరికి మినహా మూడు కుటుంబాలకు బీమా సెటిల్‌మెంట్‌ చేశామని, వారికి రూ.5 లక్షలు మంజూరయ్యాయని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆ కుటుంబాల్లోని నామినీలకు సొమ్ము చేరుతుందన్నారు. మహబూబాబాద్, వికారాబాద్‌ జిల్లాల్లోనూ ఒక్కో రైతు చనిపోయినట్లు చెబుతున్నా ఆ వివరాలు సేకరించలేదని, వారికి పాలసీ బాండ్లు ఇచ్చారో లేదో తెలుసుకుంటామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. తొలి నలుగురు రైతుల బాధిత కుటుంబాలకు స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చేతుల మీదుగా రూ. 5 లక్షల చెక్కు ఇద్దామని అనుకున్నారు. కానీ చనిపోయిన రైతు కుటుంబాన్ని మరుసటి రోజే హైదరాబాద్‌ పిలిపించడం సరికాదని చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. ఆ జిల్లాల మంత్రులు లేదా ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో సొమ్ము ఇచ్చేలా సర్కారు సన్నాహాలు చేస్తోంది.  

రూ. 636 కోట్ల ప్రీమియం  
వ్యవసాయ శాఖ దాదాపు 28 లక్షల మంది రైతుల పేరుతో ఎల్‌ఐసీకి రూ. 636 కోట్ల ప్రీమియం చెల్లించింది. రైతు బీమా గ్రూప్‌ పాలసీ కావడంతో రైతులందరి తరపున ఆ శాఖకు మాస్టర్‌ బీమా పాలసీ బాండు ఎల్‌ఐసీ ఇవ్వనుంది. బుధవారం స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్‌ సమక్షంలో బాండును ఎల్‌ఐసీ నుంచి పార్థసారథి తీసుకోనున్నారు. 

25 లక్షల మందికి..
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నాటికి 25 లక్షల మందికి పైగా రైతులకు బీమా బాండ్లు పంపిణీ చేశారు. మిగిలిన వాటిని వారంలోగా ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఆలస్యం చేసే కొద్దీ ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు నష్టపోయే ప్రమాదముంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న.. రైతుబంధు చెక్కు పొందిన ప్రతి రైతుకూ సర్కారు బీమా కల్పిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 48.77 లక్షల మందికి రైతుబంధు చెక్కులిచ్చారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 47.31 లక్షల మంది రైతులు బీమా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించారు. ఇందులో దాదాపు 28 లక్షల మంది బీమాకు అర్హులయ్యారు. చనిపోయిన వారి క్లెయిమ్స్‌ 10 రోజుల్లో అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది. వారికి సంబంధించిన 5 డాక్యుమెంట్లను స్కాన్‌ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఎన్‌ఐసీకి సమాచారమిస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎన్‌ఐసీ నుంచి ఎల్‌ఐసీకి డాక్యుమెంట్లతో సమాచారం వెళ్తుంది. ప్రతాలను పరిశీలించిన వెంటనే ఎల్‌ఐసీ వర్గాలు నామినీ బ్యాంకు ఖాతాలో క్లెయిమ్‌ సొమ్ము జమ చేస్తారు.  

మరిన్ని వార్తలు