మీతోనే అభివృద్ధి : సబితా ఇంద్రారెడ్డి 

13 Sep, 2019 02:01 IST|Sakshi

ఎన్‌ఆర్‌ఐలు, పూర్వ విద్యార్థులతో సంప్రదింపులు 

విరాళాలు ఇచ్చే వారి పేరు పెట్టే ప్రక్రియ సులభం 

సమస్యల పరిష్కారంపై సంఘాలతో భేటీ 

త్వరలో ఎస్జీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ 

బడికోసం ఓ గంట కేటాయించాలని సర్పంచులకు విజ్ఞప్తి 

‘సాక్షి’తో విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోనే 26 వేల స్కూళ్లు.. 30 లక్షల మంది విద్యార్థులు.. 1.25 లక్షల మంది టీచర్లు.. చాలా పెద్ద వ్యవస్థ.. ఇవీ కాకుండా ప్రైవేటు విద్యా సంస్థలు, సాంకేతిక, ఉన్నత విద్యా శాఖల బాధ్యత చాలా పెద్దదే. పాఠశాల విద్య పటిష్టంగా ఉంటేనే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది. అందుకే పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తాను’అని విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇటీవల విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వెల్లడించిన పలు అంశాలు ఆమె మాటల్లోనే.. 

అందరి భాగస్వామ్యంతో..
టీచర్లు, సంఘాలు, ప్రజాప్రతినిధులు, పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేసి ప్రభుత్వ బడుల అభివృద్ధికి చర్యలు చేపడతాం. ‘ఇది మీ బడి.. మీతోనే అభివృద్ధి’అంటూ ఆయా పాఠశాలల్లో చదువుకున్న ప్రముఖులను ఆహా్వనిస్తాం. విదేశాల్లో ఉండే వారిని, స్థానికంగా మంచి స్థాయిలో ఉన్న వారిని సంప్రదించి ఆయా పాఠశాలల అభివృద్ధికి నడుం బిగించాలని కోరుతాం. పాఠశాలల దత్తత ప్రోత్సహిస్తాం. విరాళాలు ఇచ్చే దాతల పేర్లను పెట్టే విషయంలో ప్రస్తుతం ఉన్న ప్రక్రియ, ఇతరుల పేర్లను పెడితే బడుల అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు అనేక మంది వస్తారు. సుదీర్ఘ ప్రక్రి య కారణంగా కొందరు ముందుకు రావట్లేదు. ఆ సమస్యను తొలగిస్తాం. దీంతో పాఠశాలకు ఆరి్థక చేయూత అందించి వాటి నిర్వహణ మెరుగుపరుస్తాం. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమం చేపడుతున్న సర్పంచులు రోజుకు గంట పాటు పాఠశాలలకు కూడా సమయం కేటాయించాలని కోరుతున్నా. 

సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా.. 
నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. అందుకు అనుగుణంగా కృషి చేస్తా. సీఎం ప్రత్యేక దృష్టి సారించిన గురుకులాల విద్య ప్రత్యేకతను చాటుకుంది. వాటిల్లో సీట్ల కోసం 1:10 నిష్పత్తిలో డిమాండ్‌ ఉంది. వాటి తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు టీచర్లు, సంఘాలతో కలసి కృషి చేస్తాం. వారి సమస్యలపైనా చర్చించి పరిష్కరిస్తాం. త్వరలోనే ఎస్టీటీ పోస్టులు భర్తీ చేస్తాం.ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేలా తీర్చిదిద్దుతాం. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా ప్రభుత్వ బడులకు వచ్చేలా చర్యలు చేపడతాం.  

డ్రాపౌట్స్‌ తగ్గింపుపై దృష్టి 
పాఠశాలలు, ఉన్నత విద్యలో డ్రాపౌట్స్‌ తగ్గించేందుకు, విద్యార్థుల హాజరు పెంచేందుకు అధికారులతో సమీక్షించి కార్యాచరణ అమలు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉచిత యూనిఫారాలు, ఉచిత పుస్తకాలు ఇస్తున్నా అవి కని్పంచట్లేదు. ఆ దిశగా మార్పులు తీసుకొస్తాం. విద్యార్థులు, టీచర్లలో పోటీతత్వం పెంపొందించేందుకు ఈ–మేగజైన్‌ ద్వారా వారు రాసిన ఆరి్టకల్స్‌ ఇస్తాం. తద్వారా తమ పేరు అందులో రావాలన్న తపన వారిలో పెరుగుతుంది. సక్సెస్‌ స్టోరీలు ఇవ్వడం ద్వారా టీచర్లలో మరింత అంకిత భావాన్ని పెంపొందిస్తాం. 

నోటుబుక్కులు,పెన్నులు తీసుకెళ్లండి.. 
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కలిసేందుకు వెళ్లేవారు శాలువాలు, బొకేలు తీసుకెళ్లవద్దు. నోటు బుక్స్, పెన్నులు తీసుకెళ్లండి. అవి పేద విద్యార్థులకు ఉపయోగపడతాయి. ఇప్పటివరకు నాకు 50 వేల నోటు బుక్స్‌ వచ్చాయి. కాగా, తన భర్త ఇంద్రారెడ్డి మంత్రిగా పనిచేసిన విద్యా శాఖను తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సబితారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

మరిన్ని వార్తలు