డ్రాపౌట్స్‌కు చెక్‌!

12 Sep, 2019 03:11 IST|Sakshi

ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపౌట్లు లేకుండా చూడాలని సబితారెడ్డి ఆదేశం

అధికారులతో అభివృద్ధి పనులు, పురోగతిపై విద్యాశాఖ మంత్రి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు లేకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా సీఎం కేసీఆర్‌ విద్యాసంస్థలకు వసతులు సమకూరుస్తూ విద్యారంగాన్ని ముందు కు తీసుకెళ్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. బుధవారం ఎస్‌సీఈఆర్‌టీ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.

విద్యాశాఖలో విభాగాల వారీగా సంబంధిత అధికారులతో మాట్లాడి చేపడుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, పురోగతి తదితరాలను సమీక్షించారు. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు అధికారులు, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌ ట్‌ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని, వీటి నివారణ సంతృప్తికరంగా లేదని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగంలో ప్రథమ స్థానంలోకి తీసుకురావాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు.  

అసెంబ్లీ సమావేశాలనంతరం సుదీర్ఘ సమీక్ష 
స్వచ్ఛ విద్యాలయ పేరుతో ప్రతి పాఠశాలల్లో 30 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సబిత సూచించారు.  ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తక్కువ సమయం కేటాయించానని.. సమావేశాల అనంతరం ప్రతి విభాగంతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహిస్తానన్నారు.

మరిన్ని వార్తలు