నాడు ఉచితం.. నేడు కోత 

5 Jun, 2020 04:10 IST|Sakshi

స్పెషల్‌ బస్సు చార్జీల కోసం మూల్యాంకన చెల్లింపులు నిలిపివేత

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకన విధులకు హాజరయ్యేందుకు నాడు ఉచితంగా ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసిన ఇంటర్‌ బోర్డు ఇప్పుడు ఆ చార్జీలను అధ్యాపకుల నుంచే వసూలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మూల్యాంకన విధులకు హాజరైనందుకు గాను అధ్యాపకులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్‌ను ఇంటర్‌ బోర్డు నిలిపివేసింది. ఇంటర్‌ బోర్డు తీసుకున్న నిర్ణయంపై అధ్యాపకులు, అధ్యాపక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కష్టకాలంలోనూ పనిచేస్తే ఇదేం పని? 
కరోనా నేపథ్యంలో మూల్యాంకనం ఆగిపోతే విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధ్యాపకులంతా గత నెలలో నిర్వహించిన మూల్యాంకనకు ప్రాణాలు తెగించి మరీ విధులకు హాజరయ్యారు. దాదాపు 16 వేలమంది మూల్యాంకన విధులను నిర్వర్తించారు. వారికోసం బోర్డు 362 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అందులో 25 మంది చొప్పున ప్రయాణించారు. అయితే ఒక్కో బస్సులో 50 మంది ప్రయాణం చేయాల్సి ఉందని, 25 మందే ప్రయాణించినందున మిగతా 25 మందికి సంబంధించిన చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రత్యేక బస్సుల చార్జీలు సాధారణ చార్జీల కంటే నాలుగు రెట్లు ఉంటుందని, అందులో ఒక వంతు చార్జీలు అధ్యాపకుల దగ్గర్నుంచే వసూలు చేయాలని, అందుకే మూల్యాంకనం పూర్తయినా, ఇంకా విధులకు హాజరైన వారికి రెమ్యూనరేషన్‌ చెల్లించడం నిలిపివేస్తూ బోర్డు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటుగా సబ్సిడీ భోజన ఖర్చు రూ. 2.5 కోట్లను కూడా మినహాయించాలని బోర్డు అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం పట్ల అధ్యాపక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూల్యాంకన విధులకు హాజరైన వారిలో ప్రైవేటు అధ్యాపకులే ఎక్కువ మంది ఉన్నారు. కరోనా కారణంగా వారికి కాలేజీల నుంచి కూడా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే పరిష్కరించాలి 
ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. ఇంటర్‌బోర్డు నిర్ణయంతో మూల్యాంకన విధులకు హాజరైన అధ్యాపకునికి రోజుకు వచ్చే రూ.1,500లలో రూ.800 వరకు చార్జీల కిందే పోయే ప్రమాదం ఉంది. బస్సు చార్జీలు, భోజన ఖర్చులు అధ్యాపకుల నుంచి వసూలు చేయకుండా, రెమ్యూనరేషన్‌ మొత్తాన్ని చెల్లించాలి. – ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి

మరిన్ని వార్తలు