శరవేగంగా హైదరాబాద్‌ అభివృద్ధి

29 May, 2020 02:33 IST|Sakshi

ఎల్‌బీనగర్‌లో ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఎల్‌బీనగర్‌/మన్సూరాబాద్‌: ప్రపంచ దేశాల నగరాలతో పోల్చితే హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఆర్‌డీపీ) పనుల్లో భాగంగా హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లోని కామినేని జంక్షన్‌లో రూ.43 కోట్ల తో నిర్మించిన 940 మీటర్ల ఫ్లైఓవర్, రింగ్‌ రోడ్డులో రూ.14.73 కోట్లతో నిర్మించిన 519 మీటర్ల అండర్‌ పాస్‌ను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలతో కలసి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపడుతున్న విధానాలతో ప్రపంచ దేశాల్లోని పారిశ్రామికవేత్తలను హైదరాబాద్‌ విశేషంగా ఆకర్షిస్తోందన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుండటంతో పెట్టుబడులు పెరిగాయన్నారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగణంగా మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో సిగ్నల్స్‌ రహిత ట్రాఫిక్‌ ఏర్పాటులో భాగంగానే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టామ న్నారు. ఎల్‌బీనగర్‌లోని 12 ప్రాంతాల్లో రూ.448 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. మరో వారంలో ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డులోని రెండో అండర్‌పాస్‌ పనులను ప్రారంభిస్తామని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, ఎమ్మెల్సీ యెగ్గె్గ మల్లేశం, జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు