కేసీఆర్ కుటుంబమే బాగుపడింది

16 Jun, 2016 08:49 IST|Sakshi
కేసీఆర్ కుటుంబమే బాగుపడింది

పెరిగిన ధరలతో జనం ఇబ్బంది పడుతున్నారు..
ప్రజల గల్లా పెట్టే ఖాళీ అవుతుంటే.. ప్రభుత్వ
ఖజానా నిండిందని సంబరపడడం హాస్యాస్పదం
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే సుస్థిర వృద్ధి సాధించింది తప్ప పేద ప్రజలు కాదని మాజీమంత్రి, పీసీసీ ఉపాధ్యక్షురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ైరెతుల ఆత్మహత్యలు సాగుతున్నాయి. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. రుణమాఫీ అమలు కావడంలేదు. నిత్యావసరాలు చిటపటలాడుతున్నాయి. ప్రజల గల్లా పెట్టే ఖాళీ అవుతుంటే... ప్రభుత్వ గల్లా పెట్టె నిండిందని సంబరపడడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.

బుధవారం గాంధీభవన్‌లో సబిత విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లలోనే తెలంగాణ భారీగా రాబడి సమకూర్చుకుందని, జాతీయ ఆర్థికవృద్ధి శాతాన్ని మించి పోయిందన్న కేసీఆర్ ప్రకటనను తీవ్రం గా ఖండించిన సబిత.. అప్పులు పుట్టక రైతాంగం అల్లాడుతుంటే కనీసం పరిహారం ఇవ్వాలనే సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. నింగినంటిన కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలను నియంత్రించాలనే బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టడం మాని జనరంజక పాలనపై దృష్టి సారించాలని పీసీసీ ఉపాధ్యక్షురాలు సబితా ఇంద్రారెడ్డి హితవు పలికారు.

>
మరిన్ని వార్తలు