చకచకా సచివాలయం బదలాయింపు

12 May, 2015 08:21 IST|Sakshi
చకచకా సచివాలయం బదలాయింపు

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం తరలింపునకు అవసరమైన భూ బదలాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. సచివాలయం నిర్మాణానికి  కంటోన్మెంట్‌లోని బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా మైదానాల్ని తమకు ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ కేంద్ర రక్షణ మంత్రిని కోరడం తెలిసిందే. ఈ మేరకు ఆ స్థలాల సమాచారాన్ని అందజేయాల్సిందిగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు స్థానిక డిఫెన్స్ ఎస్టేట్స్, లోకల్ మిలటరీ అథారిటీస్(ఎల్‌ఎంఏ) అధికారులను ఆదేశించారు. తాజాగా సికింద్రాబాద్ డిఫెన్స్ ఎస్టేట్స్ అధికారులు, ఎల్‌ఎంఏ అధికారులు పంపిన నివేదిక ఆధారంగా రక్షణ మంత్రిత్వ శాఖ కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం వెలువరించే అవకాశమున్నట్లు తెలిసింది.


గత నెలలోనే లేఖ: బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా మైదానాల్ని తమకు అప్పగించాల్సింది కోరుతూ సీఎం కేసీఆర్ గత నెల 24న  రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు లేఖ రాశారు. దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా డెరైక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్(డీజీడీఈ)అధికారులకు సూచించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరగా నివేదికను అందజేయాల్సిందిగా సూచిస్తూ ఈ నెల 6న పుణేలోని సదరన్ కమాండ్ ప్రిన్సిపల్ డెరైక్టర్ సికింద్రాబాద్ డీఈఓ కార్యాలయానికి లేఖ పంపారు.

ప్రిన్సిపల్ డెరైక్టర్ ఆదేశాలకు అనుగుణంగా నివేదికను సిద్ధం చేసిన స్థానిక అధికారులు సోమవారం సమాధానం పంపారు. భూబదలాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, అంగీకారాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు(ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉంది), లోకల్ మిలటరీ అధికారులు(ఎల్‌ఎంఏ) మధ్య సివిల్ మిలటరీ లైజన్ కాన్ఫరెన్స్(సీఎంఎల్‌సీ) జరగాల్సి ఉంది. ఈ సమావేశం సజావుగా ముగిస్తే భూ బదలాయింపు లాంఛనమే. ప్రభుత్వం కోరుతున్న ఈ 60 ఎకరాల స్థలం మార్కెట్ విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా