అక్కడ సాదా బైనామాకు నో

3 Aug, 2018 03:05 IST|Sakshi

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీన గ్రామాలపై ప్రభుత్వం స్పష్టత 

ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని భావన 

లక్షల మంది ఎదురుచూపులకు తెర

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. 2011, 2012లో సమీప నగరాలు, పట్టణాల్లో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెర దించుతూ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెల్ల కాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాకు చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రైట్స్‌ ఇన్‌ ల్యాండ్, పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ చట్టంలోని 22(2) సెక్షన్‌ మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ 2016 జూన్‌ 3న ఉత్తర్వులిచ్చింది. 2014లోపు రాసుకున్న సాదా బైనామాలను క్రమబద్ధీకరిచేందుకు అనుమతించింది. దరఖాస్తుల ఆమోదం అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఐదెకరాలలోపు భూమికి సంబంధించి సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీనీ మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. హెచ్‌ఎండీఏ, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని భూములకు వర్తించదని స్పష్టం చేసింది. సాదా బైనామా ఉత్తర్వుల సమయంలో రాష్ట్రంలో ఆరు నగరపాలక సంస్థలు, 58 మున్సిపాలిటీలు ఉండేవి. అయితే 2011లో పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాత మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సమీపంలోని వందల గ్రామాలను వాటిలో విలీనం చేశారు. వరంగల్‌ మహానగరపాలక సంస్థలో ఏకంగా 42 గ్రామాలు విలీనమయ్యాయి. ఇలాంటి గ్రామాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అనుమతించాలని డిమాండ్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ దశలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది కానీ తర్వాత పక్కనబెట్టింది. ఇటీవల పలు వర్గాల నుంచి దీనిపై విజ్ఞప్తులు వచ్చాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌ వద్ద జరిగిన రెవెన్యూ శాఖ సమావేశంలోనూ విలీన గ్రామాల్లో సాదా బైనామా అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే విలీన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణకు అనుమతిస్తే భూముల విషయంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రభుత్వానికి ఆదాయ పరంగా నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయపరంగా నష్టం జరుగుతుందని అధికారులు సూచించడంతో విలీన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణ ఉండదని స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. 

ఇప్పటిదాకా 6 లక్షలు పూర్తి
సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా 11.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 15.68 లక్షల సర్వే నంబర్లకు సంబంధించిన భూములున్నాయి. రెవెన్యూ శాఖ ఒక సర్వే నంబర్‌ను ఒక కేసుగా పరిగణించి ఈ ప్రక్రియను నిర్వహించింది. 6.18 లక్షల సర్వే నంబర్ల పరిధిలో దరఖాస్తులను ఆమోదించారు. 9.49 లక్షలకుపైగా దరఖాస్తులను తిరస్కరించారు. కబ్జాలో లేకపోవడం, విక్రయ లావాదేవీ జరిగినా వారసులు అంగీకరించకపోవడం, కొన్ని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు ఉండటం, కోర్టుల్లో కేసుల పెండింగ్‌ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులను తిరస్కరించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు లేని దరఖాస్తులను ఆమోదించామని చెప్పారు. 

మరిన్ని వార్తలు