ఏమేమి పువ్వొప్పునే..

2 Oct, 2014 06:51 IST|Sakshi
ఏమేమి పువ్వొప్పునే..

 నేడే సద్దుల బతుకమ్మ
 ట్యాంక్‌బండ్ వద్ద భారీ ఏర్పాట్లు
 
 సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాల చివరిరోజును ధూంధాంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లోనూ బతుకమ్మ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం బతుకమ్మ పుష్పోత్సవం పేరిట పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఆకట్టుకునేలా విద్యుద్దీపాల అలంకరణ, లేజర్ షోలు, బతుకమ్మ బంగారు రథాలు, ఆయా జిల్లాల్లోని విశిష్టతను చాటిచెప్పేలా ఒక్కో జిల్లా నుంచి ఒక్కో శకటం బతుకమ్మ ఊరేగింపు కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో లేజర్ షో, బీమ్ లైట్ల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరగనుంది. ఇందుకోసం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. కాగా బతుకమ్మ ఉత్సవాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనానికి వచ్చే మహిళలు చెరువుల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. కాగా.. ఈ ముగింపు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్, సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
 
   మహిళల కోసం 631 బస్సులు..
 
 హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చే మహిళల కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 631 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేల మంది మహిళలు పాల్గొంటుండగా.. పదివేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా. ఈ వేడుకలు రావాల్సిందిగా ప్రభుత్వమే దాదాపు నాలుగు వేల మందికి ఆహ్వానపత్రాలు పంపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రసాదం కూడా పంపిణీ చేయనున్నారు.
 
  బషీర్‌బాగ్ నుంచి ప్రారంభం..
 
 హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వద్ద ఉన్న ఆలియా కళాశాల నుంచి మొత్తం 11 బంగారు బతుకమ్మ రథాలు బయలుదేరుతాయి. పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేయనున్న రథంపై బతుకమ్మతో పాటు ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలావత్ పూర్ణ, క్రీడాకారిణి గుత్తా జ్వాల, సౌందర్య, సింధు, నైనా జైస్వాల్ తదితరులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలతో ఉంటారని పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా శకటం ఆలంపూర్ జోగులాంబ దేవాలయ నమూనాతో ఉంటుందని, నల్లగొండ నుంచి పానగల్ చెరువు విశిష్టతను చెబుతూ, ఖమ్మం జిల్లా నుంచి తెప్పోత్సవ నమూనా.. ఇలా శకటాలు ఉంటాయని వివరించారు.
 
  2 వేల మంది.. 10 వేల బతుకమ్మలు..
 
 సద్దుల బతుకమ్మలను తయారు చేయడానికి రెండు వేల మంది మహిళలు ఎల్‌బీ స్టేడియంలో బుధవారం నుంచే పని ప్రారంభించారు. తెలంగాణ జిల్లాల నుంచి సేకరించిన 35 టన్నుల పూలతో గురువారం సాయంత్రంలోగా 10 వేల బతుకమ్మలను పేర్చనున్నారు. ఇందులో కొన్ని బతుకమ్మలను భారీస్థాయిలో రూపొందిస్తున్నారు. కాగా కార్యక్రమం ముగింపు దశలో చేపట్టనున్న బాణసంచా పేలుడు కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఒక అధికారి చెప్పారు. హుస్సేన్‌సాగర్ రోటరీ ఘాట్‌ను బతుకమ్మ ఘాట్‌గా రూపొందిస్తున్నామని అక్కడ పది వేల బతుకమ్మలను నిమజ్జనం చేస్తారని తెలిపారు.
 
 ఒక్కరూ రావట్లేదు..!
 
 బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ స్వయంగా పలు రాష్ట్రాల మహిళా ముఖ్యమంత్రులను, జాతీయ నేతలను ఆహ్వానించినా... ఒక్కరి నుంచి కూడా తాము హాజరుకానున్నట్లు ఎలాంటి సమాచారం ప్రభుత్వానికి అందలేదు. బతుకమ్మ ఉత్సవాలను తొలిసారి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నందున... దీనికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సీఎంలతో పాటు మొన్నటి వరకు తమిళనాడు సీఎంగా జయలలితకు కూడా కేసీఆర్ ఆహ్వానం పంపారు. వీరితో పాటు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌లను కూడా ఆహ్వానించారు. వీరందరిలో జయలలిత అవినీతి కేసులో జైలుకు వెళ్లగా.. మిగతా మహిళా నేతలెవరినుంచీ కూడా ఎలాంటి సమాచారం లేదు. కాగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు మహిళా ఉన్నతాధికారులను కూడా.. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం.
 

మరిన్ని వార్తలు