రూ.250 కోట్లతో సర్కారీ బడుల్లో వసతులు

24 Feb, 2018 16:19 IST|Sakshi
పాఠశాలలో మొక్క నాటుతున్న మురళీమోహన్‌

తెలంగాణలోని 5 జిల్లాల్లో పాఠశాలల దత్తత

లైబ్రరీలు, సైన్స్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు కృషి

‘సాధన’ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ మురళీమోహన్‌ వెల్లడి

బషీరాబాద్‌(తాండూరు) : తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 500 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని రూ.2.50 కోట్లతో వసతులు కల్పించనుందని సాధన స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ మురళీ మోహన్‌ తెలిపారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలోని 30 స్కూళ్లలో రూ.12 లక్షలతో లైబ్రరీలు, రూ.3 లక్షలతో సైన్స్‌ ఎడ్యుకేషన్‌ కిట్స్‌ అందజేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ మండలంలో పది ప్రభుత్వ పాఠశాలల్లో రూ.1.20 కోట్లతో కంప్యూటర్‌ ల్యాబ్‌లు, మరుగుదొడ్లు నిర్మించామని స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి మండలంలో 25 మంది విద్యావలంటీర్లను నియమించి నెలనెలా వేతనం ఇస్తున్నామని వెల్లడించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో రూ.15 లక్షలతో బాలికల విద్య, బాల్యవివాహాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ప్లాన్‌ ఇండియా ద్వారా ప్రముఖ ఐటీ కంపెనీలు ఒరాకిల్, క్యాబ్‌ జెమినిల ఆర్థిక వనరులతో మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాల్లోని స్కూళ్లకు క్రీడా సామగ్రి అందించడం, మైదానాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం, గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం వంటిæ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ నిషేధం, విద్యాహక్కు చట్టంపై ఆయా గ్రామాల్లో కళాజాత బృందాలతో ప్రజలను చైతన్యం చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవర్చేందుకు అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒరాకిల్‌ ఐటీ కంపనీల మేనేజర్‌ శాంతి, బెంగళూరు స్నైడర్‌ కం పనీ ప్రతినిధి సుగంధ, ప్లాన్‌ ఇండి యా అధికారులు చందన్, అభిలాష్, స్థానిక విద్యాధికారి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు