పాపం.. పసివాళ్లు!

26 Nov, 2014 03:47 IST|Sakshi

పాపం.. లోకం తెలియని పసివాళ్లు. చదువులమ్మ తోటలో ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగొలిపే సంగతులతో అలరించే పువ్వులు. అమ్మానాన్నల ఆవేశాగ్నికి ఆహుతయ్యారు. ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో కాలినగాయాలతో ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. అప్పటిదాకా.. అమ్మ కోసం ఆరాటపడిన ఆ చిరునవ్వులు బోసిపోయాయి.
 
 కొడంగల్ రూరల్ / మహబూబ్‌నగర్ క్రైం / తిమ్మాజీపేట : కుటుంబ కలహాల నేపథ్యంలో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొడంగల్‌కు చెందిన గొల్ల భీమమ్మ, బాల్‌రాజ్ దంపతులకు కుమార్తెలు నందిని (6), విజయలక్ష్మి (4), ఎనిమిది నెలల శ్రీలక్ష్మి ఉన్నారు. సుమారు నాలుగేళ్లక్రిత బతుకుదెరువు నిమిత్తం తిమ్మాజీపేట మండలం మరికల్‌కు వలస వెళ్లారు.

నందిని జడ్చర్ల పట్టణంలోని న్యూ మెమోరియల్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతుండగా విజయలక్ష్మి తల్లివద్దే ఉండేది. కుటుంబ కలహాలు, అప్పుల బాధతో తాగుడుకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య సోమవారం ఉదయం తన ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకుంది. గ్రామస్తులు గమనించి వెంటనే నలుగురినీ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చి కిత్స పొందుతూ అదే అర్ధరాత్రి విజయలక్ష్మి, నందిని మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.

మంగళవా రం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఆలనాపాలనలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన చిన్నారులు అనుకోని సంఘటనతో విగతజీవులుగా మారడంతో కొడంగల్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ బలరాంనాయక్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు